ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, డీఎంహెచ్వో పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ శనివారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించి ఆసుపత్రుల స్థితిగతులు ఆసుపత్రుల సేవలు స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలుసుకున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, అత్యవసర సేవలు, ప్రసూతి సేవలు, ప్రయోగశాల పరీక్షలు, పారిశుధ్య పరిస్థితులు తదితర అంశాలపై కలెక్టర్ క్షుణ్ణంగా ఆరా తీశారు. ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సమర్థవంతంగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే ఆరోగ్య సేవల్లో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోగుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా మెడికల్ కళాశాల వసతులు వైద్య ఆరోగ్యశాఖలో నిర్మిస్తున్న భవనాల స్థితిగతులపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సమావేశంలో జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, డిఎంహెచ్వో రవి నాయక్, వైద్య విధాన పరిషత్ వైద్యులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply