చంద్రబాబు పిలుపుతో సైకిల్ యాత్ర..

చంద్రబాబు పిలుపుతో సైకిల్ యాత్ర..
ఇంధన పొదుపుకు టీడీపీ నేత వినూత్న సందేశం..
విజయవాడలో సైకిల్‌పై పలు కార్యక్రమాలకు హాజరైన ఎం.ఎస్. బేగ్..
వైద్య శిబిరం నుంచి ప్రజాదర్బార్ వరకు ఏడు కిలోమీటర్ల ప్రయాణం..
ప్రజల్లో ఆకర్షణగా నిలిచిన సైకిల్ సవారి..
భవానిపురం, ఆంధ్రప్రభ : ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో ఆరోగ్య చైతన్యం కల్పించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నేతలు చేపడుతున్న కార్యక్రమాలు విజయవాడలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం. ఎస్. బేగ్ శనివారం సైకిల్‌పై పలు ప్రజా కార్యక్రమాలకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును ఆచరణలో చూపిస్తూ భవానీపురంలోని తన నివాసం నుంచి సైకిల్‌పై బయలుదేరిన బేగ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి సహకారంతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 54వ డివిజన్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు.
అనంతరం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో 55వ డివిజన్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి కూడా సైకిల్‌పైనే చేరుకుని పాల్గొన్నారు. మొత్తం దాదాపు ఏడు కిలోమీటర్ల మేర సైకిల్‌పై ప్రయాణించి తిరిగి ఇంటికి చేరుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వైద్య శిబిరం నుంచి ప్రజాదర్బార్ వరకు సైకిల్‌పై ప్రయాణించిన బేగ్‌ను చూసిన స్థానికులు అభినందనలు తెలిపారు. రాజకీయ నాయకులు ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా ఆచరణలో ముందుండటం మంచి పరిణామమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సైకిల్ యాత్రలో టీడీపీ జిల్లా మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి మిర్జా ముజాఫర్ బేగ్, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
