తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

  • బీజేపీ నేత కడియం రామచంద్రయ్య

మోత్కూర్, ఆంధ్రప్రభ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే కొనుగోళ్లు చేపట్టి రైతుల ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని అనాజిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పార్టీ నాయకులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ధాన్యం నిల్వలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

పంట కొనకపోవడం దుర్మార్గం..
అనంతరం కడియం రామచంద్రయ్య మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజురోజుకూ ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నా అధికారులు స్పందించకపోవడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు నష్టపోకుండా ముందస్తుగా స్పందించాలన్నారు. తక్షణమే రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ధాన్యం కేంద్రాల పరిశీలన కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భీమిడి తిరుమల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు దండ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు ఏనుగు జితేందర్ రెడ్డి, గౌరు శ్రీనివాస్ గుప్తా, మండల ఉపాధ్యక్షులు గుంటి సతీష్, తీగల శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply