గణితంలో ప్రాక్టికల్స్‌తోనే విద్యార్థులకు గుణాత్మక విద్య సాధ్యం

గణితంలో ప్రాక్టికల్స్‌తోనే విద్యార్థులకు గుణాత్మక విద్య సాధ్యం
- చౌడారపు రాంప్రసాద్
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: గణితంలో కృత్యాధార బోధనతో విద్యార్థులు కేవలం సంఖ్యల ఆటను మాత్రమే కాకుండా నిత్యజీవిత సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పొందుతారని, జ్ఞానం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ప్రయోగాలు కీలకమని తెలంగాణ గణితపురం రాష్ట్ర సలహాదారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ జాతీయ మెంటర్ చౌడారపు రాంప్రసాద్ శుక్రవారం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, విద్యార్థులు సొంతంగా కృత్యాలు చేసి నేర్చుకోవడం ద్వారా విమర్శనాత్మక, తార్కిక ఆలోచన పెరుగుతుందని, గణితంపై భయం పోయి అభ్యసనం ఆనందదాయకంగా మారుతుందని ఆయన తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020 అమలు లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ గణితంలో 30 మార్కుల ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టింది.
చౌడారపు రాంప్రసాద్ సూచించినట్లుగా, ప్రతి పాఠశాలలో గణిత లేబరేటరీ ఏర్పాటు చేసి జియో బోర్డు, అబాకస్, గ్రాఫ్ పేపర్, ట్రెండిల్ వీల్, ఐసోమెట్రిక్ డాట్ పేపర్, భిన్నాంక చట్రం, డిజిటల్ ప్రొట్రాక్టర్, ఆల్జీబ్రా టైల్స్ వంటి పరికరాలతో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కొనసాగించాలి.
విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొని నేర్చుకుంటే, సిలబస్ తక్కువ సమయంలో పూర్తి చేయడం, రివిజన్ చేయడం సులభమని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం గణిత ప్రయోగ దీపికలను పంపిణీ చేసి, కొన్ని పాఠశాలలకు గణిత కిట్లు కూడా అందించిందని ఆయన గుర్తు చేశారు.
