రైతులు అధైర్య పడవద్దు..

రైతులు అధైర్య పడవద్దు..

  • ప్రభుత్వం మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీ
  • కలెక్టర్ తో పలు సూచనలు
  • ప్రభుత్వ ప్రధాన సలహాదారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

వేల్పూర్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లాలోని సోసైటీ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు పలు సూచనలు చేసి, ధాన్యం రవాణా ఆలస్యం కాకుండా ప్రత్యేకంగా లారీలను పంపించి రైస్ మిల్లులకు వెంటనే అన్‌లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి, ధాన్యం నిల్వ లేకుండా వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిజామాబాద్ జిల్లాలో మొత్తం సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా, ఇప్పటివరకు 5.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా సెంటర్లలో సుమారు 70 వేల క్వింటాళ్ల ధాన్యం మిగిలి ఉందని వెల్లడించారు. ఈ వారం రోజుల్లోనే అన్ని సెంటర్లలో కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సహకార చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, తహసిల్దార్ అనిరుద్, అమీనాపూర్ సర్పంచ్ సౌందర్య నవీన్, లక్కోర్ సర్పంచ్ అపర్ణ రాజు, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply