బాసర ఆలయ హుండీ ఆదాయం కోటి దాటింది

బాసర ఆలయ హుండీ ఆదాయం కోటి దాటింది
బాసర, ఆంధ్రప్రభ: చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను గురువారం ఆలయంలోని అక్షరాభ్యాస మండపంలో లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవో ఆంజనీదేవి సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో హుండీ ఆదాయం రూ.1,03,75,308 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆదాయం సుమారు 90 రోజుల వ్యవధిలో సమకూరిందని ఈవో పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో 40.200 గ్రాముల మిశ్రమ బంగారం, 2.550 కిలోల మిశ్రమ వెండి, అలాగే 24 అమెరికన్ డాలర్ల విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు వెల్లడించారు.

ఈ లెక్కింపు ప్రక్రియలో దేవాదాయ శాఖ నిర్మల్ పరిశీలకుడు ఆర్. రవికిషన్, ఏఈవో గంగా శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శివరాజ్, సంజీవ్ రావు, పరిపాలనా సిబ్బంది, వైదిక సిబ్బంది, ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది, బాసర పోలీసు సిబ్బంది, దేవస్థాన హోంగార్డులు, వాగ్దేవి సొసైటీ సభ్యులు, సిరిసిల్ల శివరామకృష్ణ భజనమండలి భక్తులు పాల్గొన్నారు.
