టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఏపీ పోలీసుల ఘనత

టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఏపీ పోలీసుల ఘనత

రెండు కాంస్య పతకాలతో రాష్ట్రానికి గుర్తింపు
పోలీసు క్రీడా చరిత్రలో తొలిసారి అరుదైన విజయం

గుంటూరు బ్యూరో / ఆంధ్రప్రభ : అఖిల భారత పోలీసు క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో లక్నోలో నిర్వహించిన పోలీసు క్రీడా సమాహార పోటీల్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో ఏపీ ఈగల్ బృందం రెండు కాంస్య పతకాలను సాధించింది.

ఆంధ్రప్రదేశ్ పోలీసు తరఫున పోటీల్లో పాల్గొన్న ఏపీ ఈగల్ చీఫ్ ఏ కే రవి కృష్ణ, అదనపు ఎస్పీ స్వరూప రాణి జోడీ మిశ్రిత ద్వయ విభాగంలో ప్రతిభ కనబర్చి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

అలాగే మహిళల ద్వయ విభాగంలో ఏపీపీఏ ఎస్పీ టీ శోభా మంజరి, స్వరూపారాణి జోడీ మరో కాంస్య పతకాన్ని రాష్ట్ర ఖాతాలో వేసింది.

అఖిల భారత పోలీసు టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన అధికారులు రెండు పతకాలు సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఒకే పోటీలో మిశ్రిత ద్వయ, మహిళల ద్వయ విభాగాల్లో పతకాలు రావడం పోలీసు శాఖలో ఆనందాన్ని నింపింది.

ఈ విజయంపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ ఈగల్ చీఫ్ రవికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply