10to12Days | ఒమన్ టూ.. గుజరాత్
10to12Days | ఒమన్ టూ.. గుజరాత్
10to12Days | గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం
ఇంధన భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
అరేబియా సముద్రం అడుగు నుంచి రెండు వేల కిలోమీటర్ల పైప్‌లైన్
రూ.40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
ఏడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం
10to12Days | న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో ఎదురవుతున్న ఆటంకాల దృష్ట్యా భారత్ తన ఇంధన భద్రతపై భారీ నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా సహజ వాయువును దిగుమతి చేసుకునేందుకు సముద్రం అడుగు భాగం నుంచి నేరుగా పైప్‌లైన్ వేసే మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మిడిల్ ఈస్ట్-ఇండియా డీప్ వాటర్ పైప్‌లైన్ పేరుతో పిలిచే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా ఓమన్‌ను నేరుగా గుజరాత్ తీరంతో అనుసంధానించనున్నారు. దీని అంచనా వ్యయం దాదాపు 40,000 కోట్ల రూపాయలు.
ఆరేబియా సముద్రంలో..
అరేబియా సముద్రం అడుగున సుమారు 2,000 కిలోమీటర్ల పొడవునా ఈ పైప్‌లైన్ విస్తరించి ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 3,450 మీటర్ల లోతులో ప్రయాణిస్తుంది. ఇంతటి లోతైన పైప్‌లైన్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన సాంకేతిక విన్యాసంగా నిలవనుంది. దీని ద్వారా ప్రతిరోజూ సుమారు 31 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును భారత్ పొందవచ్చు. దీని నిర్మాణానికి ఐదు నుంచి ఏడేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని..
భారత్ ప్రస్తుతం తన గ్యాస్ దిగుమతుల్లో అధిక భాగం హర్మూజ్ జలసంధి ద్వారానే పొందుతోంది. ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల వల్ల ఈ మార్గంలో అంతరాయం కలగడంతో గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా 10-12 డాలర్లు ఉండే గ్యాస్ ధర సంక్షోభ సమయంలో 25 డాలర్లకు చేరుకుంది. కేవలం ఎల్‌ఎన్‌జీ (LNG) దిగుమతులపై ఆధారపడితే దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని భావించిన ప్రభుత్వం, ఈ డెడికేటెడ్ పైప్‌లైన్ ద్వారా స్థిరమైన, తక్కువ ధరకే గ్యాస్ సరఫరాను నిర్ధారించుకోవాలని భావిస్తోంది.
సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని..
ఇంధన భద్రత విషయంలో మన పొరుగు దేశం చైనా ఇప్పటికే చాలా ముందుంది. రష్యా, మధ్య ఆసియా దేశాల నుంచి చైనాకు భూమార్గం ద్వారా అనేక పైప్‌లైన్లు ఉన్నాయి. చైనా గ్యాస్ నిల్వ సామర్థ్యం 2026 నాటికి 80 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుకోనుంది. కానీ భారత్ వద్ద కేవలం 10-12 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును పూడ్చేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ గెయిల్ , ఐఓసీ ( వంటి దిగ్గజ సంస్థలను రంగంలోకి దించి సమగ్ర నివేదిక సిద్ధం చేయమని ఆదేశించింది.
అందుబాటులోకి వస్తే తిరుగులేని శక్తిగా..
ద సౌత్ ఏషియా గ్యాస్ ఎంటర్‌ప్రైజ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పనులు వేగవంతం కానున్నాయి. ఈ పైప్‌లైన్ ద్వారా కేవలం ఓమన్ నుండే కాకుండా భవిష్యత్తులో యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్ , కతార్ వంటి దేశాల నుంచి కూడా గ్యాస్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో సుమారు 2,500 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఈ పైప్‌లైన్ అందుబాటులోకి వస్తే భారత్ ఇంధన రంగంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది.
