14thMayeditorial | ఇంధన సంక్షోభ వేళ మోడీ కీలక నిర్ణయం

14thMayeditorial | ఇంధన సంక్షోభ వేళ మోడీ కీలక నిర్ణయం
14thMayeditorial | వాహనాల సంఖ్య తగ్గించి ఆదర్శంగా నిలిచిన ప్రధాని
ట్రాఫిక్ సమస్యల తగ్గింపుపై కూడా ప్రభావం
విదేశీ పర్యటనల విషయంలో మోడీ ఆచితూచి అడుగులు
ప్రపంచ నాయకుల్లో మోడీకి పెరుగుతున్న ఆదరణ
14thMayeditorial | ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిన తరుణంలో ఇంధనాన్ని పొదుపుగా వాడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఆదివారం దేశ ప్రజలకు ఇచ్చిన సలహాను ముందుగా తానే అమలులో పెట్టారు. సాధారణంగా ప్రధానమంత్రి పర్యటనకు వెళ్లేటప్పుడు ఆయన వాహన శ్రేణిలో 30 నుంచి 40 వాహనాలు ఉంటాయి. వాటి సంఖ్యను ఆయన రెండుకు తగ్గించారు. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. చిన్న పదవులను నిర్వహించేవారు తమ హోదాను ప్రదర్శించేందుకు భారీ సంఖ్యలో వాహనాలతో వెళ్తుంటారు. ప్రముఖుల పర్యటనల్లో వాహనాల సంఖ్య తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ఇంధనం ఆదా అవుతుంది. ఖర్చు తగ్గుతుంది. ఆ విధంగా ప్రభుత్వ వ్యయం తగ్గుతుంది.
ప్రధానమంత్రి స్థాయిలో నాయకుని వాహన శ్రేణి తగ్గితే, దిగువ స్థాయి వారు కూడా తమ వాహనాలను తగ్గించుకుంటారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఉద్బోధలు చేయడమే కాదు, ముందుగా వాటిని వారు ఆచరించాలనే సూత్రాన్ని మోడీ ఆచరించి చూపుతున్నారు. ప్రధాని వాహన శ్రేణిని తగ్గించుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. తన పర్యటనల కోసం ట్రాఫిక్ ఇబ్బందులను కలిగించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసులను ఆదేశించారు. ఇలా ప్రధానమంత్రి మొదలు ముఖ్యమంత్రుల వరకు, వారి నుంచి అన్ని స్థాయిల్లో నాయకులు, అధికారులు పాటిస్తే, ఇంధనం కోసం ప్రభుత్వం చేసే వ్యయం కలిసొస్తుంది.
అయితే, ప్రధానమంత్రి మోడీ విషయంలో ఆయన ఎక్కువ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నోట ఈ విమర్శ తరచూ వస్తుంటుంది. అయితే భారత్ వంటి సువిశాల దేశానికి అధినేతగా ఆయన అనివార్యంగా విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా దేశాల అధినేతలు మోడీని మధ్యవర్తిత్వం వహించేందుకు రమ్మని ఆహ్వానించాయి. కానీ వారితో ఆయన ఫోన్లోనే సంభాషణ జరిపారు.

అలాగే విదేశీ పర్యటనల విషయంలో మోడీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లకుండా, వర్చువల్గా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎక్కువగా ఆయన పర్యటనలు జరిపినప్పటికీ, ఇంధన సంక్షోభం వచ్చిన తర్వాత చాలా వరకు పర్యటనలను తగ్గించేశారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా ఇదే మాదిరిగా వర్చువల్గా ప్రారంభోత్సవాలు జరుపుతూ పర్యటనలను కుదించుకుంటున్నారు.
మోడీని చూసి నేర్చుకోవాలని నార్డిక్ దేశాల ప్రధానులకు, అధినేతలకు నార్వే పత్రిక సలహా ఇచ్చింది. మోడీకి స్వదేశంలో 70 శాతం ప్రజల మద్దతు ఉందని, యూరప్ దేశాల అధినేతలకు ఇది లేదని ఆ పత్రిక ఈ నెల 18వ తేదీన నార్వే పర్యటనకు వెళ్లనున్న సందర్భంగా ప్రచురించిన ఒక వ్యాసంలో పేర్కొంది. మోడీని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడుగా ఆ పత్రిక అభివర్ణించింది. ఆయనను నార్వే మాజీ ప్రధాని ఐనార్ గెర్హార్డ్సెన్తో పోల్చింది. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని దానిని అమలు చేసిన వాడే నిజమైన ప్రజా నాయకుడు అని ఆ పత్రిక పేర్కొంది.
