అంతమ్మగూడెంలో కాలుష్య కోరలు

అంతమ్మగూడెంలో కాలుష్య కోరలు

-మనుగడ కోసం గ్రామస్తుల పోరాటం
​- నిరాహార దీక్షకు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, బీజేపీ నేతల మద్దతు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషతుల్యమైన వ్యర్థాలతో చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిశ్రమలు వదులుతున్న వాయు, జల కాలుష్యం కారణంగా పీల్చే గాలి, తాగే నీరు, పండించే పంటలు పూర్తిగా కలుషితమై ప్రజలు జీవించలేని దారుణ పరిస్థితి నెలకొందని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కుంభం పురుషోత్తం రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ​​

పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలని, తమ ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బుధవారం అంతమ్మగూడెం గ్రామస్తులు భారీ ఎత్తున నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి తో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఇన్కమ్ టాక్స్ అధికారి మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పాకనాటి దామోదర్ రెడ్డి సందర్శించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

​ఈ సందర్భంగా ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు, “కాలుష్యం వద్దు – ప్రాణాలు ముద్దు” ​అన్నారు. భూగర్భ జలాలు విషతుల్యమని, పరిశ్రమల రసాయన వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలవడంతో గ్రామాల్లో తాగే నీరు విషంగా మారుతోందని మండిపడ్డారు.

​కలుషిత గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులతో ప్రజలు విలవిలలాడుతున్నారని పేర్కొన్నారు. పంట భూములు కలుషితమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు తక్షణమే స్పందించకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు.

​​బీజేపీ నేతలు ఇంద్రసేనారెడ్డి, దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ మండలి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. పరిశ్రమల యాజమాన్యాల లాభాపేక్ష కోసం సామాన్య ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం అన్యాయమని, కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంతమ్మ గూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి గౌరవాధ్యక్షులు గుమ్మి నరేందర్ రెడ్డి, అధ్యక్షులు గుమ్మి దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వస్పరి ప్రభ, ఉపాధ్యక్షులు రావుల రాంరెడ్డి, రేణుక, గుర్రం రామచంద్ర రెడ్డి, కాలుష్య బాధితుడు రావుల శశికిరణ్ తో పాటు గ్రామస్తులు నరసింహ , బాల్ రెడ్డి, మహేష్, శివరాజు, రమేష్, లింగయ్య, జంగమ్మ, కలమ్మ , ధనలక్ష్మి, ముత్తమ్మ, సురేందర్ రెడ్డి, పక్కీరు తదితర గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరిశ్రమల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply