నదుల స్వచ్ఛతకు ప్రజల సహకారం అవసరం..

నదుల స్వచ్ఛతకు ప్రజల సహకారం అవసరం..
- కే.సి. కెనాల్, హంద్రీ నది ప్రాంతాల్లో కమిషనర్ పరిశీలన
- నదుల ఇరువైపులా వెంటనే శుభ్రత పనులకు ఆదేశాలు
- కొండారెడ్డి బురుజు అన్న క్యాంటీన్ నిర్వాహకులపై ఆగ్రహం
కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : నగరంలో నదుల స్వచ్ఛత పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన కే.సి. కెనాల్, హంద్రీ నది ప్రాంతాల్లో ముమ్మరంగా పరిశీలించారు. నదుల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతపై స్థానిక ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నదులు ఇరువైపులా వెంటనే శుభ్రత పనులు చేపట్టాలని సూచించారు.
అనంతరం కొండారెడ్డి బురుజు సమీపంలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ నిర్వహణలో లోపాలు గుర్తించిన ఆయన నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం నలుగురు మాత్రమే విధుల్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. సూపర్వైజర్‌ను మార్చాలని సిటి సూపర్వైజర్‌కు ఆదేశించారు. అదే విధంగా రైతు బజార్ వద్ద పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, శానిటేషన్ ఇంస్పెక్టర్లు జిలాని, రమేష్, నాగేశ్వరరావు, అనిల్, మునిస్వామి, కుర్మయ్య, తదితరులు, పాల్గొన్నారు.
