సాంఘిక సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ప్ర‌వేశాలు ప్రారంభం…

సాంఘిక సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ప్ర‌వేశాలు ప్రారంభం…

33 హాస్ట‌ళ్ల‌కు ఔత్సాహిక విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం
జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారిత అధికారి కేఎల్ హర్షిత

విజయవాడ, ఆంధ్రప్రభ : జిల్లాలోని 33 సాంఘిక సంక్షేమ బాలురు, బాలిక‌ల వ‌స‌తి గృహాల్లో 2026-27 విద్యా సంవ‌త్స‌రానికిగాను మూడో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల ప్ర‌వేశాల‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారిత అధికారి కేఎల్ హర్షిత మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. అదేవిధంగా ఇంట‌ర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, ఫార్మసీ , మెడికల్, పీజీ, నర్సింగ్, పారామెడికల్ కోర్సులలో చదువుకొనే విద్యార్థులు పోస్టు మెట్రిక్ హాస్ట‌ళ్ల‌లో ప్ర‌వేశాల‌కు గాను ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు.

ప్రి మెట్రిక్‌కు సంబంధించి  బాలురుకు 10, బాలికలకు 11 వసతి గృహాలు ఉన్నాయ‌ని, పోస్టు  మెట్రిక్‌కు సంబంధించి  బాలురుకు 6, బాలికలకు 6 వ‌స‌తి గృహాలు ఉన్న‌ట్లు తెలిపారు. విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 9, నందిగామ పరిధిలో 13, తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 హాస్టళ్లు ఉన్న‌ట్లు తెలిపారు. ప్రతి హాస్టల్ నందు 100 మందికి  ప్ర‌వేశం ఉంటుంద‌ని.. ఎస్‌సీల‌కు 70 శాతం, మిగిలిన వారికి 30 శాతం కేటాయించడం జ‌రుగుతుంద‌న్నారు.

సాంఘిక సంక్షేమ గృహాల‌ను ప్ర‌భుత్వం ఆధునికీక‌రించింద‌ని, ఆర్‌వో ప్లాంట్ల ద్వారా శుభ్రమైన తాగునీరు, మెనూ ప్ర‌కారం పౌష్టికాహారం వంటివాటితో పాటు సీసీ కెమెరాల‌తో భ‌ద్ర‌తా ఏర్పాట్లు ఉన్నాయ‌న్నారు. కాస్మెటిక్స్ ఛార్జీలు, వివిధ ర‌కాల వ‌స్తువులు, క్రీడా సామ‌గ్రి వంటివాటిని ఉచితంగా అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ట్యూట‌ర్లు కూడా అందుబాటులో ఉంటార‌న్నారు. విద్యార్థులు త‌మ గ్రామంలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా లేదా నేరుగా ద‌గ్గ‌ర్లోని హాస్టల్ వార్డెన్ / సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌న్నారు.

పూర్తి స‌మాచారానికి విజ‌య‌వాడ‌, తిరువూరు, నందిగామ డివిజ‌న్ల సహాయ సాంఘిక సంక్షేమశాఖ అధికారుల కార్యాలయాలు, మండలంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ కార్యాల‌యం, విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట‌లోని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయాన్ని సంద‌ర్శించ‌వ‌చ్చ‌న్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల లోపు  87907 52259, 94925 83600 నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి కూడా స‌మాచారం పొంద‌వ‌చ్చ‌ని ఎస్‌సీ సంక్షేమం, సాధికారిత అధికారి కేఎల్ హ‌ర్షిత తెలిపారు.

Leave a Reply