బంగారుపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతి…
బంగారుపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతి…
ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహం భద్రపరిచిన పోలీసులు.
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలోని బంగారుపేట సర్కిల్ పరిధిలో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండి, తెలుపు రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడు.
అయితే మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచినట్లు టూ టౌన్ సీఐ శ్రీధర్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ను లేదా టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
