రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ భూ సేకరణకు నిధులు విడుదల చెయ్యండి…

రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ భూ సేకరణకు నిధులు విడుదల చెయ్యండి…

సీఎం చంద్రబాబుకు ఎంపీ శబరి వినతి..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణం లోని నూనెపల్లిలో రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం భూసేకరణకు నిధులు కేటాయించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి వినతి పత్రం ఇచ్చారు. సోమవారం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబును ఎంపీ శబరి కలిసి విన్నవించారు.ఈ సందర్బంగా ఎంపీ శబరి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ప్రాంతంలో ఎల్ సి నెం.185 కు బదులుగా ఆర్ ఓ బి నెం 228 ఏ నిర్మించబడిందని మీ దృష్టికి తీసుకువస్తున్నామని సీఎం వివరించారు.

ఈ నూనె పల్లె ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో నిరంతరంగా భారీగా పాదచారులు అక్రమంగా ప్రవేశించడం వలన, ఈ ప్రదేశం ప్రజలకు, రైలు కార్యకలాపాలకు తీవ్రమైన, ఇబ్బందులు కలుగుతున్నాయి. భద్రత ప్రమాదంగా మారిందన్నారు. గతంలో రైల్వే అధికారులకు మంత్రులకు 2024 ఆగస్టు 29వ తేదీన, 2025 సెప్టెంబర్ ఒకటో తేదీన ఎంపీ ఆధ్వర్యంలో ఉత్తరాలు రాశాన్నన్నారు. అర్జీలకు స్పందించిన రైల్వే శాఖ అధికారులు 25 సెప్టెంబర్ 26వ తేదీన రైల్వే, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేపట్టారు సర్వే నిర్వహించారు.

తనిఖీ, సర్వే నివేదిక ప్రకారం, 2335 చ.మీ.ల భూసేకరణ తప్పనిసరిగా కావాలన్నారు. ఇందుకు అవసరమయ్యే ఒక రోడ్ అండర్ బ్రిడ్జిని ప్రతిపాదించడం జరిగిందని ఎంపీ సీఎం కు వివరించారు. నూనె పల్లె ప్రాంతంలో సుమారుగా 30 గ్రామాల ప్రజలు ఈ రహదారి గుండా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారన్నారు.ఈ ప్రవేశాలను నివారించడానికి, ప్రజల, కార్యాచరణ భద్రతను నిర్ధారించడానికి అత్యవసరమైన నూనపల్లి ప్రాంతంలో రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం, సంబంధిత 2335 చదరపు మీటర్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలని సీఎంను కోరారు. నంద్యాల ప్రజల కోరిక తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.