Palnadu Child Marriage : బాలికకు పెళ్లి ..Andhra Prabha Top News
Palnadu Child Marriage : బాలికకు పెళ్లి ..Andhra Prabha Top News
అధికారులు బ్రేక్
- పల్నాడులో సంచలనం
- తెల్లవారుజామున 2 గం.లకు సమాచారం
- పల్నాడు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ తక్షణ స్పందన
(నరసరావుపేట ఆంధ్రప్రభ)

Palnadu Child Marriage : పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం, రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహాన్ని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా సకాలంలో స్పందించి, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా విజయవంతంగా అడ్డుకున్నారు.

రామచంద్రాపురం తండాలో ఒక మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్లు తెల్లవారు జామున 2 గంటలకు ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న సంజన సింహ వెంటనే స్పందించి, సంబంధిత అధికారులను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్దుర్తి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎస్.ఐ, ఐ.సి.డి.ఎస్, చైల్డ్-లైన్ ప్రతినిధులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు, బాలిక వయస్సు ధృవీకరణ పత్రాలను పరిశీలించగా, వివాహానికి చట్టబద్ధమైన వయస్సు నిండలేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో అధికారులు వెంటనే వివాహాన్ని నిలిపివేసి, బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేసే బాల్య వివాహాలను జరపవద్దని ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం వివాహానికి బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండడం తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమించి బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులు, ఇందుకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంజనాసింహ స్పష్టం చేశారు.
