Rayalaseema Automobile Hub | ఆటోమొబైల్ రంగంలో భారీ ఊపు

Rayalaseema Automobile Hub | ఆటోమొబైల్ రంగంలో భారీ ఊపు

Rayalaseema Automobile Hub | తిరుపతి (రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో: రాయలసీమ ప్రాంత ఆటోమొబైల్ పారిశ్రామికాభివృద్ధి పథంలో మరో ప్రముఖ దిగ్గజ సంస్థ చేరబోతోంది. ప్రసిద్ధ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటుకు తిరుపతి జిల్లా వేదిక కానుంది. ఇప్పటికే శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ఇసుజు, హీరో, కియా సంస్థలు ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఆటోమొబైల్ ప్రాజెక్టులు కర్నూలు, కడప జిల్లాలను ఈవీ ఆటోమొబైల్ హబ్‌లుగా మార్చనున్నాయి.

రాయలసీమ తూర్పు సరిహద్దుల్లోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సత్యవేడులో 2008లో శ్రీసిటీ పారిశ్రామిక వాడ ఏర్పాటుతో పారిశ్రామిక ప్రగతి మొదలైంది.ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని శ్రీసిటీ ప్రాంగణంలో జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్ వాహనాల సంస్థ, శ్రీసిటీ వెలుపల సత్యవేడు వద్ద హీరో మోటార్ సైకిళ్ల సంస్థ, అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ కియా మోటార్స్ వాహనాల ఉత్పత్తులు మొదలయ్యాయి. వీటికి అనుబంధంగా అవసరమైన యంత్ర పరికరాలను అందించే సంస్థలు రాయలసీమ పరిధిలో డజనుకు పైగా అడుగుపెట్టాయి.

అనతికాలంలోనే దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పారిశ్రామిక వాడగా పేరొందిన శ్రీసిటీ ప్రస్తుతం జాతీయస్థాయిలో ఉత్తమ పారిశ్రామిక వాడగా నిలిచింది. ఈ క్రమంలోనే మెట్రో రైలు సర్వీసులకు బోగీలు తయారుచేసే ఆల్టామ్, వివిధ దేశాలకు చెందిన నిట్టాన్, పయోలాక్స్, డేనియెలీ, ఎన్హెచ్‌కే స్ప్రింగ్స్ వంటి ఆటోమొబైల్ సంస్థలకు శ్రీసిటీ వేదికగా మారింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత

ఇంకోవైపు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటవుతున్న మొబిలిటీ వ్యాలీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అవసరాలకు కావాల్సిన ఆటోమొబైల్, కంపోనెంట్స్ అందించే వేదికగా రూపుదిద్దుకుంటోంది. అదేవిధంగా వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో రూపుదిద్దుకుంటున్న సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఫర్ ఈవీ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ వ్యవస్థ హ్యుందాయ్, టయోటా, హీరో వంటి ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ (ఓఈఎం) వేదికగా సిద్ధమవుతోంది.

ఇవి కాక ఉమ్మడి చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 20 దాకా చిన్న, పెద్ద ఆటోమొబైల్ సంస్థలు కొనసాగుతున్నాయి. ఈ మొత్తం వ్యవస్థల పెట్టుబడులు లక్ష కోట్ల వరకు ఉండగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షకు పైగా స్థానిక ఉపాధి అవకాశాలను కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

త్వరలో బుల్లెట్ బైకుల ప్లాంట్

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ త్వరలో తిరుపతి జిల్లాలో ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి ఫలితంగా రూ.2,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

సత్యవేడు ప్రాంతంలోని వన్నెలూరు, రాళ్లకుప్పం ప్రాంతాల్లో బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. 350 ఎకరాల స్థలంలో రెండు దశలుగా కొనసాగే వాహనాల ఉత్పత్తి క్రమంలో తొలి దశలోనే 5-10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్లాంట్ విస్తరణ దశలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. త్వరలో అధికారిక ఒప్పందాలు పూర్తి చేసి భూమిపూజ చేయడానికి సంస్థ యాజమాన్యం సిద్ధమవుతోంది. సమీప భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతం అత్యుత్తమ ఆటోమొబైల్ హబ్‌గా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply