PM MITRA Park | తెలంగాణకు భారీ ప్రోత్సాహం

PM MITRA Park | తెలంగాణకు భారీ ప్రోత్సాహం

PM MITRA Park | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఓ వైపు పెట్టుబడులు, మరోవైపు ఉపాధి, పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా తెలంగాణలోని వరంగల్‌లో “పీఎం మిత్ర” పార్కును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది పారిశ్రామిక జౌళి రంగ వృద్ధి ప్రస్థానంలో చారిత్రక ఘట్టంగా నిలుస్తోంది. కొత్తగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఇప్పటికే కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన ఈ తొలి పార్కును రూ.1695.54 కోట్లతో నిర్మించారు. ‘ఫామ్ టు ఫైబర్ – టు ఫ్యాక్టరీ – టు ఫ్యాషన్ – టు ఫారిన్’ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫైవ్-ఎఫ్ (5-ఎఫ్) దృక్కోణానికి అనుగుణంగా ఇది ఏర్పాటైంది.

ప్రతిపాదిత నాగ్‌పూర్ – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్‌హెచ్-163జీ)కి సమీపాన, వ్యూహాత్మకంగా ఎన్‌హెచ్-163కు దగ్గరగా ఈ పార్కు రూపుదిద్దుకుంది. దీంతో ప్రధాన రైల్వే నెట్‌వర్కులు, ఓడరేవులతో దీనికి అద్భుత బహుళ రవాణా అనుసంధానం ఏర్పడుతుంది. తద్వారా అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు నిరంతర రవాణా సదుపాయం కల్పిస్తుంది.

విస్తృత అంతర్గత రహదారి నెట్‌వర్క్, ప్రత్యేక విద్యుత్ సబ్‌స్టేషన్, నిరంతర నీటి సరఫరా సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి పారిశ్రామికావరణ వ్యవస్థగా ఈ పార్కు రూపొందింది. ఇందులో శూన్య ద్రవ వ్యర్థ సాంకేతికతతో నిర్మించిన సార్వత్రిక ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ) ఉన్నందువల్ల సుస్థిర ప్రగతికి భరోసా ఇస్తుంది.

ఈ పార్కుకు వివిధ మార్గాల ద్వారా రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయన్న అంచనాల నడుమ ఇప్పటికే 62 శాతం భూమి కేటాయింపు పూర్తయ్యింది. పనులు వేగంగా పురోగమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ జౌళి రంగ వృద్ధి ప్రస్థానంలో ఈ పార్కు కీలక చోదకశక్తిగా నిలుస్తుంది.

సువిశాల ప్రాంగణం….

మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంతో, జౌళి రంగ విలువ వ్యవస్థ అంతటా భారీ స్థాయిలో అవకాశాలను సృష్టించేందుకు ఈ పార్కు సిద్ధమైంది. ఆ మేరకు 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయనే అంచనాల నడుమ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగ సృష్టి సాగింది.

దేశంలో జౌళి రంగ మౌలిక సదుపాయాల కోసం జాతీయావరణ వ్యవస్థకు చేయూత లక్ష్యంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 7 పీఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వశాఖ 2023 మార్చిలో ఆమోదం తెలిపింది.

ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని వరంగల్ నగరంలోగల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)ను ఎంపిక చేసి 2022 సంవత్సరం మార్చి నెలలో ఆమోదం కోసం ప్రతిపాదన పంపింది. అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణ, పరిశ్రమల స్థాపనకు సౌకర్యాల కల్పనపై హామీతో పీఎం మిత్ర పథకం కింద బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీలో దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో కేఎంటీపీలో ఏర్పాటు చేసే పరిశ్రమల కోసం రూ.200 కోట్ల అభివృద్ధి మూలధన మద్దతు సహా రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతుకు అర్హత సాధించింది.

ప్రాజెక్టు వ్యయం రూ.1695.54 కోట్లు

ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1695.54 కోట్లు కాగా, పార్కులో పరిశ్రమల స్థాపనను ఉద్దేశించిన 548 ఎకరాలకు పీఎం మిత్రా పార్కు ప్రకటన తర్వాత 310 ఎకరాలను ఇప్పటిదాకా పరిశ్రమలకు కేటాయించారు.

ఈ పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలతోపాటు జౌళి రంగానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు లభిస్తాయి. పీఎం మిత్ర పథకం కింద కాంపిటీటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్ (సీఐఎస్) కూడా అందుతుంది. ఇక్కడి తయారీ యూనిట్లకు ప్రోత్సాహక మద్దతుకు అర్హత లభిస్తుంది.

ఇందుకోసం ప్రతి పార్కుకు రూ.300 కోట్ల నిధిని ప్రభుత్వం కేటాయిస్తుంది కాబట్టి, ఈ పార్కులు పెట్టుబడిదారులను మరింతగా ఆకర్షిస్తాయి. దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యే పీఎం మిత్ర పార్కులోని యూనిట్లన్నింటికీ కేంద్ర ప్రభుత్వ ఇతర పథకాలతో అనుసంధానం ద్వారా వివిధ ప్రయోజనాలు పొందే అర్హత కూడా లభిస్తుంది.

వరంగల్‌లోని పీఎం మిత్ర పార్కులో ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపారెల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ కూడా పీఎల్‌ఐ పథకంతో లబ్ధి పొందడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ కంపెనీ రూ.1051 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో, సుమారు రూ.1990 కోట్ల వార్షిక వ్యాపార పరిమాణంతో దాదాపు 12,800 మందికి ఉపాధి కల్పించనుంది.

Leave a Reply