prime minister | తెలంగాణపై క‌మ‌లం క‌న్ను

prime minister | తెలంగాణపై క‌మ‌లం క‌న్ను

prime minister |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ పర్యటనకు ముందు ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. మార్పు కోరుకుంటున్న జనం ఇప్పుడు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారు” అని ప్రధాని అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పశ్చిమ బెంగాల్‌లో ఘనవిజయంతో ఊపుమీదున్న బీజేపీ.. తమ తదుపరి టార్గెట్‌గా తెలంగాణను ఎంచుకుంది. తెలంగాణ రాష్ర్టంలో అధికారమే ల‌క్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందుకోస‌మే ప్ర‌ధాని మోదీ ఇవాళ తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయం ఒక్క‌సారిగా వేడెక్కింది.

హైదరాబాద్‌ మహానగర పరిధిలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ వేదికా హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. బల్దియా పరిధిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ అత్యంత కీలకం కానుంది. కాగా, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను గెలిచింది. ఈసారి మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ సాధించి మూడు కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా తెలంగాణ బీజేపీ భావిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ముందుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడం కీలకమని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇందుకనుగుణంగా ప్రధాని బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తమ ఎత్తుగడలకు కొరుకుడు పడని బెంగాల్‌లోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పట్టు సాధించిన తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో అగ్రనాయకత్వం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడతల వారీగా రాష్ట్రంలో పర్యటించబోతున్నారని తెలిపాయి. ఇద్దరు అగ్రనేతలే కాకుండా.. మరికొందరు కీలక నేతలు కూడా తెలంగాణలో మకాం వేయబోతున్నారని, వచ్చే ఎన్నికల వ్యూహరచనను ఇప్పటినుంచే అమలు చేయాల‌ని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మోదీ రాక రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. ఇది సాధారణ పర్యటన కాదు.. రాబోయే ఎన్నికల యుద్ధానికి ఓ బలమైన సంకేతమంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఒకవైపు అభివృద్ధి మంత్రం మరొకవైపు ఇటీవల కేసీఆర్, రేవంత్ రెడ్డిల బహిరంగ సభలకు ధీటుగా రాజకీయ డైలాగ్స్ పేలుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేల్చే అవకాశం కూడా లేకపోలేదు. గ్రామీణ, మండల ప్రాంతాల్లో కూడా మోదీ మీటింగ్‌పై భారీ అంచనాలు ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది. ప్రధాని మోదీ వస్తే ఏదో మార్పు వస్తుందన్న జోష్ కమల దళం శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే మోదీ టూర్.. పార్టీకి ఓట్లు తెచ్చిపెడుతుందా..?అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.

Leave a Reply