may10Sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
may10Sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
may10Sunday2026 | అన్ని రోజులూ అమ్మవే…

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సంప్రదాయంగా ఏడాదికి ఒక్కరోజు మే 10 – మదర్స్ డే (మే రెండో ఆదివారం) మదర్స్ డే కావచ్చు కానీ, అన్ని రోజులూ అమ్మవే…అన్ని జీవితాలూ అమ్మవే. మనం అనుభవిస్తున్న జీవితంలోని ప్రతి క్షణం…అమ్మ మోసిన నవమాసాల సంరక్షణ ఫలితం కాదా, అమ్మ పడిన పురిటి నొప్పుల త్యాగం ఫలితం కాదా…అమ్మ గురించి ఏం చెప్పినా తక్కువే…అమ్మ త్యాగాల గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. అందుకే అమ్మ అనే పదం గురించి, మలి వయసులో నిరాదరణకు గురవుతున్న అమ్మల గురించి కొంత మాట్లాడుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా మాతృత్వానికి గౌరవం తెలుపుతూ ప్రతి ఏడాది మే నెల రెండో ఆదివారం “మదర్స్ డే”ను జరుపుకుంటారు. దేశానికో సంప్రదాయం, సంస్కృతిని బట్టి ఈ రోజు వేడుకల రూపం మారినా.. తల్లి పట్ల ప్రేమ, కృతజ్ఞత మాత్రం ఎక్కడైనా ఒకటే.
1907లో అన్నా జార్విస్ అనే మహిళ తల్లుల గౌరవార్థం ప్రత్యేక దినోత్సవం ఉండాలనే ఆలోచనను ముందుకు తెచ్చారు. ఆమె ప్రయత్నాల ఫలితంగా మదర్స్ డే ప్రారంభమైంది. అనంతరం 1914లో ఈ రోజుకు అధికారిక గుర్తింపు లభించింది.
కానీ కాలం మారింది…జీవితాల వేగం పెరిగింది…పెద్ద పెద్ద మండువా లోగిళ్ళు కాసా చిన్న చిన్న ఫ్లాట్స్ అయిపోయాయి. మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. ఇంకా పెరిగిపోతూనే ఉంది.
ఒకప్పుడు “అమ్మ తిన్నాకే నేను తింటా” అని చెప్పిన పిల్లలే…
ఇప్పుడు “అమ్మ ఫోన్ చేస్తోంది… తర్వాత మాట్లాడతా” అనేంత బిజీ అయిపోయారు.
తన పిల్లల కోసం జీవితమంతా త్యాగం చేసిన అమ్మ…చివరికి అదే తన పిల్లలు తన మాట వినడానికి ఐదు నిమిషాలు కూడా దొరకని పరిస్థితి ఎంత విషాదకరం!
అమ్మ ప్రేమకు లెక్కలుండవు…
ప్రపంచంలో ప్రతి బంధానికీ ఏదో ఒక అర్థం ఉంటుంది. కొన్ని బంధాలు అవసరంతో అవసరం కోసం మాత్రమే ఏర్పడతాయి…అవసరం లేదనిపిస్తే ఆ బంధాలు నిలబడవు.
కొన్ని బంధాలు పరిస్థితులతో రాజీపడి కొనసాగుతాయి…కానీ “అమ్మ” అనే బంధం మాత్రం పూర్తిగా నిస్వార్థం.
పిల్లాడు చిన్నప్పుడు రాత్రంతా నిద్రపోకుండా కాపాడేది అమ్మే. తనకు కొత్త చీర కొనకపోయినా… పిల్లాడికి మంచి డ్రెస్ కొనిపెట్టేది అమ్మే. ఇంట్లో అందరూ తిన్నాక చివర్లో చల్లారిన అన్నం తిన్నా… “నాకు ఆకలిలేదు” అనేది కూడా అమ్మే. మనకు కావలసినవి నాన్నతో అడిగి, పోట్లాడి కొనిపించింది కూడా అమే.
కానీ నేడు అమ్మ ఒంటరైపోయింది. వృద్ధాశ్రమాల్లో పెరుగుతున్న అమ్మల కంట నిశ్శబ్దంగా కారే కన్నీరు అందుకు సాక్ష్యం. ఇది టెక్నాలజీ యుగం కావచ్చు…కానీ ఒంటరితన యుగం కూడా.
ఒకప్పుడు పిల్లల నవ్వులతో కళకళలాడిన ఇళ్లు…ఇప్పుడు తలుపులు మూసుకుని నిశ్శబ్దంగా మారిపోతున్నాయి. చాలా చోట్ల వృద్ధాశ్రమాల్లో కనిపించే అమ్మల కళ్లలో మౌనంగా కదలాడేది ఒకే ఒక్క ప్రశ్న…

“నా పెంపకం లోపమా?… లేక కాలమే మారిపోయిందా?”
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు. ఎందుకంటే, అమ్మని చూడడానికి రాలేకపోయేవారంతా మాతృద్రోహులు కారు, అమ్మల మీద ప్రేమ లేని వారు అసలే కాదు.
ఇప్పుడు మదర్స్ డే వస్తే చాలామంది సోషల్ మీడియాలో ఫోటోలు, లవ్ యూ మాం అని స్టేటస్ పెడతారు.. హార్ట్ ఎమోజీలు పంపిస్తారు..అవి తప్పు కాదు, కానీ నిజంగా అమ్మ కోరేది ఇవేనా?
రోజుకు కనీసం ఒక్కసారి “అమ్మా… ఎలా ఉన్నావ్?” అని అడిగే ప్రేమే ఆమెకు పెద్ద గిఫ్ట్.
ఎందుకంటే ప్రతి తల్లికి తన పిల్లలు ఎప్పుడూ చిన్నవాళ్లే. అమ్మ ఉన్న ఇల్లు… దేవాలయం లాంటిదే. ఇంట్లో అమ్మ ఉన్నంతవరకు ఆ ఇంటికి ఓ వెలుగు ఉంటుంది..ఓ భరోసా ఉంటుంది..ఓ ఆప్యాయత ఉంటుంది..
అమ్మ లేని ఇంట్లో అన్నీ ఉన్నా… ఏదో ఖాళీగా అనిపిస్తుంది.
అందుకే పెద్దలు “మాతృదేవోభవ” అన్నారు.
మదర్స్ డే ఏడాదికి ఒక్కరోజే కావచ్చు.
కానీ అమ్మ చేసిన త్యాగాలకు జీవితకాలం సరిపోదు. అమ్మ మన కోసం గడిపిన జీవితాన్ని తిరిగి ఇవ్వలేము. కానీ ఆమె మిగిలిన జీవితంలో ఒంటరితనం రాకుండా మాత్రం చూడగలం.
ఈ మదర్స్ డే రోజున ఖరీదైన గిఫ్ట్ కొనకపోయినా పర్వాలేదు, గ్రాండ్ గా సెలబ్రేషన్లు చేయకపోయినా పర్వాలేదు.
కానీ ఒక్కసారి అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడండి.ఆమె చేతిని పట్టుకుని…
“నువ్వు ఉన్నావ్ కాబట్టే నేను ఉన్నాను అమ్మా…”
అని చెప్పండి.
ఆ ఒక్క మాట…
ఆమె జీవితానికే పెద్ద పండుగ అవుతుంది.
అదే మదర్స్ డే.

రాజు అంటే ప్రజాసేవకుడు
విజయపురి మహారాజుకి అహంకారం ఎక్కువ. తన పరిపాలన వల్లే రాజ్యం సుభిక్షంగా ఉందని అతగాడి విశ్వాసం. ఆ కారణంగా ప్రజలు తన పట్ల కృతజ్ఞత కలిగివుండాలని భావించేవాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏదో ఒక సందర్భం కలిపించుకొని ప్రజలు ఆ వేడుక ఉత్సహంగా జరుపుకోవాలని శాసనం చేసాడు.
ఆ ఏడాది వర్షాలు చాలినంత లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . ఆకరువు కాలంలోనే రాజుగారి పుట్టినరోజు వచ్చి పడింది. ఇంకేం, తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించమని చాటింపు వేయించాడు మహారాజు. కాటకం కారణంగా ప్రజలెవరూ ఉత్సవం పట్ల ఉత్సాహం చూపించలేదు.
వెలవెలబోయిన వీధులను చూసి విజయపురి రాజుగారికి పట్టరాని కోపం ముంచుకొచ్చింది.
“నేను ఇంత గొప్పగా రాజ్య పాలన సాగిస్తుంటే జనం కనీసం ఉత్సవాల ద్వారా అయినా కృతజ్ఞతలు ప్రకటించరా?” అని అగ్రహించాడు. అలిగి రాజ్యం వదిలి ఒక అడవిలో విలాసవంతమైన భవంతి కట్టుకొని ప్రజలకు దూరంగా నివసించసాగాడు.
రాజు వెళ్ళిపోగానే ప్రజలు మొదట కంగారు పడ్డారు. కానీ, రోజులు గడిచేకొద్దీ రాజ్యంలో మంచి మార్పులు పొడసూపటం మొదలయ్యాయి.
రాజు లేకపోవడంతో అతగాడి తరుపున చేసే ఆడంబరాలు తగ్గిపోయాయి. బలవంతపు పన్నుల వసూలు ఆగిపోయింది. రక్షకభటుల జోక్యం లేకపోవటంతో కలహాలు తగ్గించుకుని తమలో తామే సర్దుబాటు చేసుకుంటున్నారు. పై నుంచి ఏ సాయం అందక పోయేసరిగా జనమే సంఘటితంగా తమ సమస్యలను పరిష్కరించుకోసాగారు. శ్రమదానం ద్వారా చెరువులు తవ్వుకున్నారు. కలసి మెలసి శ్రద్ధగా సాగు చేయడంతో పంటలు పుష్కలంగా పండాయి. రాజ్య సిబ్బంది బలవంతపు వసూళ్ళు లేకపోవడంతో ఊరి ఖజానాలు నిలకడగా ఉండి ఎక్కడికి అక్కడ ప్రజల అవసరాలకు సొమ్ము సులువుగా అందుతోంది.
రోజులు సుఖంగా గడచి పోతుండటంతో ప్రజలు రాజుగారి ఉనికిని క్రమంగా మర్చిపోసాగారు
జనం తన కోసం వస్తారని ఎదురు చూసి చూసి నిరాశ చెందిన రాజుగారు , తానే మారువేషంలో రాజ్యానికి వెళ్ళాడు. ప్రజలందరూ ఏడుస్తూ, దీనంగా తన రాక కోసమే ఎదురుతెన్నులు చూస్తుంటారని ఆశించిన రాజుగారికి ఆశా భంగమయింది.
రాజుగారు ఒక తల పండిన పెద్దాయనను అడిగాడు, “తాతా! మీ రాజుగారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా, మీకు దిగులుగా లేదా?”
ఆ ముసలాయన నవ్వి, “నాయనా! రాజుగారు అలిగి వెళ్ళిపోవడం మాకు ఒక రకంగా మేలే చేసింది. ఆయన ఉన్నప్పుడు మేమంతా ఆయన మెప్పు కోసమే బతికేవాళ్ళం. ఇప్పుడు మా కోసం మేము బతుకుతున్నాం. నిజానికి రాజు అనేవాడు ప్రజల అవసరాలను తీర్చడానికి ఉండాలి కానీ, ప్రజలు తన అవసరాలు తీర్చాలని కోరుకోకూడదు”అన్నాడు.
జనం మీద అలగడం అంటే నేత తన బాధ్యత నుండి తప్పించుకోవడమే. ప్రజలంటే నేత పల్లకీ మోసే బోయీలు కాదు. అసలైన నేత తనకు తానుగా బాధ్యత తీసుకుని వెంట వచ్చే వారిని సరైన దారిలో నడిపిస్తాడు.
సేవకే అధికారం. అహంకారం ప్రదర్శించటానికి కాదు. నేత లేకపోయినా సమాజం నడుస్తుంది. సమాజం లేకపోతే నేత ఉండడు. జనాదరణ అంటే పొగడ్తలు కాదు. సేవ ద్వారా ప్రజల నుంచి పొందే మన్ననలు.
======================================

ఫస్ట్ ఇంప్రెషన్
ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కొందరు.అంటే మనం ఎవరినైనా తొలిసారి కలిసినపుడు లేదా మనల్ని ఎవరైనా తొలిసారి కలిసినపుడు ఆ వ్యక్తి మీద మనకు కలిగే ఇంప్రెషన్ అలాగే మన మీద వారికి కలిగే ఇంప్రెషన్. అయితే ఈ నానుడి లో నిజం ఉందా ? అనే సందేహం నాకు కలుగుతూ ఉంటుంది.
నేను పీహెచ్డీ కి జాయిన్ అవాలని నిర్ణయించుకున్నాక ఆ యూనివర్సిటీ డిపార్ట్ మెంట్స్ లో ఉన్న ప్రొఫెసర్స్ ప్రొఫైల్ చూద్దామని ఇంటర్నెట్ ఓపెన్ చేశాను. అందరి ప్రొఫెసర్స్ వి ప్రొఫైల్స్ చూస్తూ వెళుతున్నా.కాసేపటికి నాకు కావలసిన ప్రొఫెసర్ ప్రొఫైల్ దొరికింది. ఆయన పేరు మాత్రమే నాకు తెలుసు కాబట్టి , ఆయన ఫోటో చూడగానే కొంచెం భయం వేసింది. ఎందుకో ఆయన చాలా స్ట్రిక్ట్ ప్రొఫెసర్ అని నాకు అనిపించింది.అది ఆయన పట్ల నా ఫస్ట్ ఇంప్రెషన్.
తర్వాత రోజుల్లో నేను పీహెచ్డీ జాయిన్ అయ్యాక ఆయన్ను వెళ్ళి కలిశాను.ప్రత్యక్షంగా చూడడానికి ఆయన చాలా సింపుల్ గా ఉన్నారు. ఫోటో లో ఉన్నంత సీరియస్ గా లేరు. నాతో చాలా బాగా మాట్లాడారు కూడా. ఆయనతో మాట్లాడి తిరిగి వస్తున్నప్పుడు ‘ సార్ ..చాలా మంచి వారు లా ఉన్నారు.ఫోటో చూసి నేనే తప్పుగా అనుకున్నాను ‘ అని మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యాను.
కానీ..రోజులు గడుస్తున్న కొలదీ ఆయన ఎంత స్ట్రిక్టో నాకు అర్థం అయింది. అన్నీ రూల్ ప్రకారం జరగాలి అని పట్టుపట్టే వారు. ఎక్కడా నాకు ఫ్రీడం ఇవ్వలేదు. నానా తంటాలు పడి రూల్స్ అన్నీ సరిపోయేలా నా వర్క్ కంప్లీట్ చేసి పట్టా తీసుకునేటప్పటికీ దేవుడు కనిపించాడు. ఆయన పట్ల నా ఫస్ట్ ఇంప్రెషన్ కరెక్టే అని అప్పుడు అనిపించింది.
సో..మీకు కూడా ఇలాంటివి అనుభవంలోకి రావచ్చు ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడూ బెస్ట్ గా ఉండేలా మనం జాగ్రత్త తీసుకోవాలి.అలాగే ఎదుటి వారిని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు జాగ్రత్తగా అంచనా వెయ్యాలి. !!!!
=====================

జనం కోసం జీవితం లేదా, మన కోసం?
జనం కోసం జీవితం లేదా, మన కోసం?
రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుధుశ్చేరి. వెస్ట్ బెంగాల్ లో బిజెపి అధికారంలోకి రావడం, తమిళనాడులో సినిమా హీరో విజయ్ అద్భుతం చేయడం చూశాం. ఎన్నికల హడావుడి ముగిసింది. బ్యాలెట్, ఈవీఎం పారదర్శకత, దొంగవోట్లు, దొంగనోట్లు, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రజల అనుమానాలు…ఇది వేరే చర్చ. ప్రజలకు నిత్య జీవితంలో వంద సమస్యలు. సంఘటితం అయ్యి పోరాడే ఓపికలు ఎవరికి ఉన్నాయి. ఇక్కడ ఎవరి పరుగు పందెం వారిది. ఇద్దరు స్నేహితులు ఒక ఆరు నెలలు సఖ్యంగా ఉన్నారు అని మీరు ఆరు సాక్ష్యాలు చూపించండి! మేం, గొప్ప, నేను గొప్ప, అధికారం, ఆధిపత్య ధోరణిలు అందరి జీవితాల్లోకి వచ్చేశాయి. అందుకే దేశంలో విడాకులు యుద్ధం, భార్యా భర్తల కేసులు…పెద్ద ఆర్థిక లాభంగా దేశంలో 60 శాతం లాయర్లకు ఉంది అని రీసెర్చ్ చెబుతోంది. బంధాల మధ్య, సక్రమం, అక్రమం ఎన్నో గీతలు చేరిపోయాయి. ప్రజల మానసిక ఇబ్బందులే మద్యం వ్యాపారులకు లాభం, పెట్టుబడి! డ్రగ్స్ వాడకం, క్లబ్బులు, పబ్బులు, యువత పెడతోవ…అన్నీ చర్చనీయాంశాలే!
ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం అన్యాయం, అహంకారం, మతం మూర్ఘత్వం, ఆయిల్, చమురు బావులపై ఆధిపత్యం, ..వీటి వెనుక చీకటి కోణాలు విద్యార్థిలోకం అధ్యయనం చేసి భవిష్యత్ లో తెర వెనుక దాగిన నిజాలు బహిర్గతం చేస్తుంది. ఈ యుద్ధం ఫలితాలు జూన్ ఒకటి నుంచి దేశం మొత్తం క్లోజ్ షాట్ లో అనుభవస్తుంది. అన్నీ పిరం అయ్యి, అంటే రేట్లు పెరిగి దేశంలో పేద వర్గాలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.
సరే మనం, ఈ వారం టాపిక్ లోకి వస్తే, నిరంతరం మన దైనందిన జీవితం ఒక భయంలో, ఒక ఆందోళనలో నడుస్తుంది. మనస్సు ఎన్నో చెయ్యాలని చెబుతుంది. ఆకాశంలో లక్ష్యాలను నిర్దేశిస్తుంది. శరీరం సహకరించదు. క్రమశిక్షణ, సహనం, సమయం సరిపోదు. ఎన్నో చోట్ల వెనుకబడతాము. మనం నిజాయితీగా మెట్లు ఎక్కుతూ కష్టపడతాము. ఈ లోపు కొందరు, మన కన్నా తక్కువ టేలెంట్ ఉన్నవాళ్లు(మనం అలా అనుకుంటాం) లిఫ్ట్ ఎక్కి చివరి అంతస్తుకు చేరిపోతారు. కోట్ల రూపాయలు, కారులు, ఇల్లు, విల్లాలు, బిరుదులు, అవార్డులు వారిని చేరతాయి. మన కన్నా వయసులో చిన్నవారు కూడా మనల్ని దాటుకుని వెళ్ళిపోతారు. మనకు నిద్ర పట్టదు. జీవితంలో ఐపోయాను, ఓడిపోయావు అని సమాజం చెబుతుంది. మన మనస్సు మనల్ని మరింతగా బాధ పెడుతుంది. భౌతిక మాయ, వాస్తవ సమాజంలో మర్యాదలు అన్నీ కలిసి మనల్ని బాధలోకో, భయంలోకో నెడతాయి. డబ్బు ఉంటే, డబ్బు విజయం కలిసి మన జీవితంలో ఉంటే సమాజంలో వచ్చే గౌరవం వేరు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తు రు …పద్యం మనకు తెలుసు.
కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతరాత్మ చెప్పే అసలు విజయం వేరు. ఆ సాధన, వైరాగ్యం, detachment వైపు మన అడుగులు పడాలి.
వాళ్ళు ఏం అనుకుంటారు? వీళ్లు ఏం అనుకుంటారు? 24 గంటలు మనకు ఇవే అలోచనలు. పక్కింటి వాళ్ళు, ఎదురు ఇంటి వాళ్ళు ఏం అనుకుంటారు? లోగ్ క్యా సోచెగా? ఇదే గోల మనది. వాళ్ళు అనుకుంటారు? అది ముఖ్యం కాదు, అసలు మనం ఏం అనుకుంటాము? అదే ముఖ్యం.
సోషల్ స్టిగ్మా మనల్ని భయపెడుతుంది. నడిపిస్తున్నది. నడిపిస్తుంది. ఊరు మధ్యలో ముత్యాలమ్మ గుడి, వేప చెట్టు, దాని చుట్టూ సిమెంటు దిమ్మ, మనుషులు కూర్చోవడానికి అరుగులు, దాని ఎదురుగా వినాయకుడు గుడి, పక్కన ఆంజనేయ స్వామి గుడి.. ముత్యాలమ్మ గుడి చుట్టూ ఊరి పెద్దలు ప్రతి రోజు సాయంత్రం, కూర్చుంటారు! ఒకోసారి పొద్దున, పొలం వెళ్ళి, నాలుగు పనలు గడ్డి దూళ్ళకు కోసుకు వచ్చి ఐదు మెతుకులు తిని, అక్కడకు వచ్చి కూర్చుంటారు. మన దేశంలో చాలా గ్రామాల్లో ఇది సహజం.
ఊరు మాట్లాడే పిచ్చాపాటీ మాటల్లో, ఎన్నో నిజాలు, ద్వేషాలు, పగలు, అసూయలు, అహంకారాలు అన్నీ చాలా స్పష్టంగా సిగ్గు లేకుండా వ్యక్తం అవుతాయి! గొల్ల పేరంటాలు అమ్మవారు చూసి, విని నవ్వుకుంటుంది. మన దేశంలో ఊరికి ఒక దేవత సాక్ష్యంగా ఉండడం మనకు తెలుసు.
జనం కాదు, మనం, ఏం అనుకుంటునామో అది ముఖ్యం.
ఎవరైతే కీర్తి కాంక్ష లేకుండా పని చేస్తారో వారి ద్వారా దేవుడు మహత్కార్యాలను చేయిస్తాడు!
మనస్సాక్షితో సత్యం వైపుకు, లోక కల్యాణం వైపుకు మన అడుగులు కదలాలి అని కోరుకుందాం! లోకా సమస్థాస్సుఖినోభవంతు!
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

తిరుమల పాలనలో శ్రీ వ్యాసరాయల ముద్ర
ఆది నుంచి వైఖానస ఆగమోక్తమైన అర్చక విధివిధానాలను మాత్రమే అనుసరించే తిరుమలక్షేత్ర నిత్య పూజా కైంకర్య నిర్వహణను 12 ఏళ్లపాటు మధ్వ సంప్రదాయ పరంపర కు చెందిన సుప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త శ్రీ వ్యాసరాయలు గా ప్రసిద్ధి చెందిన శ్రీ వ్యాస తీర్థులు 12 ఏళ్ల పాటు నిర్వహించారు.
శాసనాధారాల ప్రకారం 14వ శతాబ్దపు మధ్యకాలంలో తిరుమలేశుని నిత్యా పూజా కైంకర్యాలను నిర్వహించే వైఖానస అర్చక కుటుంబంలో అవాంతరం ఏర్పడింది. వారి కుటుంబీకులు తిరుమలేశుని నిత్య పూజా విధులను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు తమ రాజవంశ ఆధ్యాత్మిక గురువులైన శ్రీ వ్యాసరాయలకు విజయనగర రాజులు ఆ బాధ్యతను అప్పగించారు.
ద్వైత సిద్ధాంతానికి చెందిన మధ్వ సంప్రదాయవాది అయినా ఆయన 1486 – 1498 మధ్యకాలంలో 12 ఏళ్లపాటు తిరుమలలోనే ఉండి వైఖానస ఆగమోక్తంగానే తిరుమలేశుని నిత్య పూజా కైంకర్యాలకు కొనసాగించారు. విజయనగర రాజులు తనకు ఇచ్చిన 5 గ్రామాలను, 14 వేల కార్పణాలు (ఒక కర్పణం అంటే సుమారు 3 గ్రాముల బంగారు నాణెం) తిరుమల క్షేత్రంలో, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఏడాది పొడవునా 345 రకాల ప్రసాదాల తయారీ కి వినియోగించడానికి సమర్పించారు.
ఆ గ్రామాల నుంచి తగినంత ఆదాయం లభించేవిధంగా 9 చెరువులను త్వవ్వించి వ్యవసాయాన్ని పెంపొందింప చేశారు. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన తిరుమలేశుని గర్భాలయ గోపుర విమాన శిఖరం పై ఉన్న వెంకటేశ్వరస్వామి మూర్తికి ప్రాధాన్యత పెంచిన శ్రీ వ్యాసరాయలు ఇప్పటికీ కొనసాగుతున్న విమాన వెంకటేశ్వర స్వామి దర్శనానికి శ్రీకారం చుట్టారు. తిరుమలేశునిపై భక్తితో శ్రీ వ్యాసరాయలు సమర్పించిన పవిత్ర సాలగ్రామ మాల అను నిత్యం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కి ధరింప చేసే ఆభరణాలలో ఒకటిగా నేటికీ భాసిల్లుతోంది.
12 ఏళ్ల తరువాత అర్హత సంపాదించిన అనువంశిక అర్చక కుటుంబానికి తిరుమలేశుని అర్చన బాధ్యతలను అప్పగించి స్వస్థలానికి తిరిగి వెళ్లిపోయారు. తరువాత కూడా వివిధ విజయనగర రాజవంశీకులలో తిరుమలేశునిపై భక్తిని పెంపొందించి వారి వారి హయాంలలో తిరుమల క్షేత్రానికి విశేష లబ్ది చేకూర్చడంలో ప్రాధాన్యత వహించారు. శ్రీ వ్యాసరాయల ద్వారా స్ఫూర్తి పొంది తిరుమల క్షేత్రాన్ని తరచుగా సందర్శించి ఎన్నో సమర్పణలు చేసిన విజయనగర్ ప్రభువులలో శ్రీ కృష్ణదేవరాయలు కూడా ఉన్నారు. శ్రీ వ్యాసరాయల హయాంలో తిరుమల లో ఏర్పాటైన వ్యాసతీర్థమఠం ఇప్పటికీ తిరుమలక్షేత్ర ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగస్వామిగా కొనసాగుతోంది
ఓం నమో వేంకటేశాయ

