TG | లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డులో ‘బీహార్’ కలకలం!

TG | లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డులో ‘బీహార్’ కలకలం!

అడ్డాలుగా మారుతున్న నివాస గృహాలు.. భయం గుప్పిట్లో స్థానికులు
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

TG |లక్ష్మిగూడ, ఆంధ్రప్రభ ప్రతినిధి : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డు కాలనీ ఇప్పుడు అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. ముఖ్యంగా బీహార్‌కు చెందిన వలస కార్మికులు, వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేగంబజార్, కొత్తూరు, కాటేదాన్ వంటి పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునే వీరు.. లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డును తమ సురక్షిత అడ్డాగా మార్చుకుంటున్నారు.

నిబంధనలకు తిలోదకాలు
కాలనీలో ఇప్పటికే పలు ఇళ్లను కొనుగోలు చేసిన వీరు, నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఇంట్లో గుంపులు గుంపులుగా నివసిస్తున్నారు. సాధారణంగా ఒక ఇంట్లో ఉండాల్సిన సంఖ్య కంటే రెట్టింపుగా, అంటే పది మందికి పైగా చేరుతూ ఆ ప్రాంత ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు. అసలు ఆ ఇళ్లలో ఏం జరుగుతోంది? ఎంతమంది ఉంటున్నారు? అనే విషయాలను పర్యవేక్షించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కాలనీవాసులు మండిపడుతున్నారు.

మితిమీరిన మద్యం.. పెచ్చుమీరుతున్న గొడవలు
రాత్రి వేళల్లో విచ్చలవిడి మద్యం తాగి కాలనీలో వీరంగం సృష్టించడం ఇక్కడ నిత్యకృత్యమైంది. మద్యం మత్తులో పరస్పరం దాడులు చేసుకోవడం, పెద్ద పెద్దగా కేకలు వేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఒక హత్య కూడా జరగడం ఇక్కడి శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది.

పోలీస్ నిఘా అవసరం
కాలనీలో పెరిగిన ఈ వలసల వల్ల మహిళలు, పిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు స్పందించి లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డులో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, అనుమానితుల వివరాలను సేకరించి నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply