1985dec | 40 ఏళ్ల సైనిక అనుభవానికి కేంద్రం గుర్తింపు

1985dec | 40 ఏళ్ల సైనిక అనుభవానికి కేంద్రం గుర్తింపు

1985dec | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన సీడీఎస్‌ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) పదవికి కేంద్ర ప్రభుత్వం కొత్త నియామకం చేపట్టింది. భారత తదుపరి సీడీఎస్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సీడీఎస్‌గా ఉన్న జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30తో ముగియనుండగా, అనంతరం రాజా సుబ్రమణి ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. సీడీఎస్ హోదాతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మిలిటరీ వ్యవహారాల విభాగానికి కార్యదర్శిగా కూడా ఆయన సేవలందించనున్నారు.

దాదాపు 40 ఏళ్లపాటు భారత సైన్యంలో వివిధ కీలక హోదాల్లో పనిచేసిన రాజా సుబ్రమణి అనుభవజ్ఞుడైన అధికారి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో శిక్షణ పొందిన ఆయన, 1985 డిసెంబర్‌లో గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ ద్వారా భారత సైన్యంలో చేరారు. సేవాకాలంలో యూకేలోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్‌, ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లలో ఉన్నత స్థాయి సైనిక శిక్షణ పూర్తి చేశారు.

విద్యార్హతల పరంగా కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ నుంచి ఎంఏ పట్టా పొందిన ఆయన, మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ పూర్తి చేశారు.

సైనిక సేవల్లో భాగంగా జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్ డిప్యూటీ కమాండర్‌గా విధులు నిర్వహించారు. అస్సాంలో నిర్వహించిన ‘ఆపరేషన్ రైనో’లో కౌంటర్ ఇన్సర్జెన్సీ బలగాలకు నాయకత్వం వహించారు. పశ్చిమ సరిహద్దులో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఆర్మీ 2 కోర్ప్స్ కమాండర్‌గా కూడా పనిచేశారు. అదనంగా కజకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిఫెన్స్ అటాచ్‌గా సేవలందించారు.