కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు
కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రైతులు ఆరుగాలం శ్రమించి పంట సాగు చేయడం ఒక ఎత్తయితే, చేతికి వచ్చిన పంట ధాన్యాన్ని విక్రయించడం పెను సవాలుగా మారింది. ధాన్యం విక్రయించేందుకు కల్లాల్లో పంట రాశులు పోసి, పడిగాపులు కాయాల్సి వస్తోంది. రెండు రోజులుగా అకాల వర్షాలు, పెనుగాలుల బీభత్సం అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద కొర్రీలు పెడుతూ, ధాన్యం తూకాల్లో దగా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం కూడా కల్పించడం లేదని వాపోతున్నారు. దీనికి తోడు సాయంత్రం వేళల్లో మబ్బులు కమ్ముకుని గాలి దుమారం, అకాల వర్షాలు అన్నదాతను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు.
ఇప్పుడు జీవన్మరణ సమస్యగా మారింది..
నిద్రాహారాలు మాని, రైతులు కల్లాల్లోనే పడిగాపులు కాస్తూ అకాల వర్షానికి తడిసిన ధాన్యంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటూ ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు వద్ద మంగళవారం అర్ధరాత్రి ప్రకృతి బీభత్సం, అనుకోని వానల నుంచి పంటను కాపాడుకునేందుకు వెళ్లి గోడకూలి నలుగురు మృతి చెందిన సంఘటన రైతు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. పంట కొనుగోళ్లలో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు ధాన్యం సేకరించి, గోదాములకు తరలిస్తే ఈ దుస్థితి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది.
వేధిస్తున్న గన్నీ సంచుల కొరత
పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వస్తే, కనీసం గన్నీ సంచులు కూడా ప్రభుత్వం సమకూర్చకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాల నుంచి పంటను రక్షించుకునేందుకు టార్పాలిన్ కవర్లు కూడా పంపిణీ చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 349 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు కేవలం 120 కేంద్రాలు మాత్రమే తెరిచారు. 45 లక్షల గన్నీ బ్యాగులు సమకూర్చాల్సి ఉండగా, 26 లక్షలే అందుబాటులో ఉంచారు.
ఈ సమస్యలు పరిష్కరించాలని రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజూ ఆందోళనలు చేపడుతున్నారు. బుధవారం నిర్మల్ జిల్లా గుండంపల్లి జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రైతులు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపైనే వంటావార్పు చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు.
ముళ్లకంపలు తీసుకువచ్చి రోడ్లపై పడేసి వాహనాల రాకపోకలను నిలిపివేసి స్తంభింపజేశారు. భైంసా మండల కేంద్రంలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేయాలని మార్కెట్ యార్డు వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందించి తాము ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిర్మల్ మార్కెట్ యార్డులో గన్నీ సంచుల కొరతపై రైతులు ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
