Lady Singham Hyderabad | అర్ధరాత్రి సీపీ సుమతి సీక్రెట్ ఆపరేషన్
Lady Singham Hyderabad | అర్ధరాత్రి సీపీ సుమతి సీక్రెట్ ఆపరేషన్
Lady Singham Hyderabad | అర్ధరాత్రి సీపీ సుమతి సీక్రెట్ ఆపరేషన్
ఒంటరి మహిళగా మఫ్టీలో రంగంలోకి దిగిన సీపీ
వెకిలి చేష్టలతో రెచ్చిపోయిన పోకిరీలు
40 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
మహిళల భద్రతపై సీపీ సుమతి గట్టి సందేశం
Lady Singham Hyderabad | హైదరాబాద్, ఆంధ్రప్రభ : మంగళవారం అర్ధరాత్రి దాటి సుమారు ఒంటి గంటైంది. రోడ్లన్నీ హడావుడిగా ఉన్నాయి. బైకులపై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న పోకిరీలు హుషారుగా తిరుగుతున్నారు. ఇంతలో ఓ యువతి ఒంటరిగా రోడ్డుపై అటూ ఇటూ తచ్చాడుతోంది. ఆ యువకుల దృష్టి యువతిపై పడింది. ఒంటరిగా కనిపించేసరికి సరదాగా ఆమెను ఆటపట్టించాలని అనిపించింది.
అంతే… ఒకరి తరువాత ఒకరుగా రావడం, వెకిలి ప్రశ్నలతో వేధించడం మొదలుపెట్టారు. అమానుషంగా వ్యవహరించారు. ఇవన్నీ దూరం నుంచి గమనిస్తున్న కొందరు మఫ్టీలోని పోలీసులు వారిని ఒక్కొక్కరిగా పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. ఇలా ఓ రెండు గంటల పాటు సాగింది. అసలు విషయం తెలుసుకున్న అక్కడివారు అవాక్కయ్యారు. ఒకింత సంతోషం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ యువతి ఎవరో కాదు… సాక్షాత్తూ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి.
అసలేం జరిగిందంటే…
రోడ్డుపై ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు పోకిరీలు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా వేధిస్తున్నారు. ప్రతిరోజూ మహిళలు అనుభవిస్తున్న వేదనను తెలుసుకున్న సీపీ సుమతి తానే స్వయంగా రంగంలోకి దిగారు. అర్ధరాత్రి మఫ్టీలో కమిషనరేట్ పరిధిలో ఎక్కడెక్కడ పోకిరీలు మహిళలను వేధిస్తున్నారనే విషయం తెలుసుకుని, దిల్‌సుఖ్‌నగర్ వెళ్లి బస్టాండ్‌లో నిలబడ్డారు.
మొత్తంగా రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున వరకు అక్కడే ఉన్నారు. భాగ్యనగర నడిబొడ్డున ఒక ఐపీఎస్ అధికారిణి చేపట్టిన ఈ సాహసోపేత సీక్రెట్ ఆపరేషన్ అందరినీ ఆలోచింపచేసింది.
చుట్టుముట్టిన 40 మంది పోకిరీలు..
ఒకరు కాదు, ఇద్దరు కాదు.. సుమారు 40 మంది పోకిరీలు సీపీ సుమతిని చుట్టుముట్టారు. “వస్తావా?”, “రేటెంత?” అంటూ అసభ్యకరమైన ప్రశ్నలతో మహిళా సీపీని వేధించారు. దారి వెంట వెళ్తుంటే బైక్‌లతో వెంబడించారు. అయినా ఆమె ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా తెల్లవారుజామున 3:30 వరకు అక్కడే ఉండి, ప్రతి ఒక్క పోకిరీ ప్రవర్తనను గమనించారు. ఆ తర్వాత ఆమెను చూసిన ఓ ఎస్సై సీపీ మేడమ్‌కు సెల్యూట్ కొట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ 40 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పోకిరీలకు కౌన్సెలింగ్..
పట్టుబడిన వారిలో అధిక శాతం విద్యార్థులు, ఉద్యోగులే కావడం గమనార్హం. వీరిలో కొందరు గంజాయి, మద్యం మత్తులో తూలుతూ విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. ఈ ఆపరేషన్ కేవలం నేరస్థులను పట్టుకోవడం కోసం మాత్రమే కాదని, వ్యవస్థలో మార్పు కోసం చేసిన పెనుమార్పు అని సీపీ సుమతి మహిళా లోకానికి సందేశమిచ్చారు.
కార్యాలయంలో కూర్చోకుండా, అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి మహిళల బాధను తెలుసుకున్న సీపీ సుమతి నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, 100 వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని, ఆపదలో ఉన్నప్పుడు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని ఈ ఆపరేషన్ భరోసా కల్పిస్తోంది.
చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగం చేస్తున్న యువకులు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటం అక్కడి పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. పోలీసులు వారికి స్వీట్ కౌన్సెలింగ్ మాత్రమే కాదు.. ఒకింత గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చి పంపించారు.
