బెంగాల్ తీర్పు మార్పుకు సంకేతం

బెంగాల్ తీర్పు మార్పుకు సంకేతం
- అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ: దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలు ప్రజల్లో మార్పు ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సహా మూడు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో సోమవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెంగాల్ ప్రజలు అభివృద్ధి, పారదర్శకత, భద్రతను కోరుకుంటూ తీర్పు ఇచ్చారని అన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పును సూచిస్తున్నాయని తెలిపారు. మరోవైపు అస్సాంలో మరోసారి బీజేపీకి ప్రజలు మద్దతు తెలపడం అభివృద్ధి పట్ల విశ్వాసానికి నిదర్శనమన్నారు. పుదుచ్చేరిలో కూడా కూటమి విజయం సాధించడం పార్టీ బలం పెరుగుతున్నదానికి సంకేతమని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఇదే తరహా మార్పు కనిపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం కార్యకర్తలు టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
