పంటల మార్పిడి భూసార పరీక్షలతో అధిక దిగుబడి
పంటల మార్పిడి భూసార పరీక్షలతో అధిక దిగుబడి
ఊట్కూర్, ఆంధ్రప్రభ: రైతులు తమ వ్యవసాయ పొలాల్లో పంట మార్పిడి విధానం అవలంబిస్తూ భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని ఊట్కూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి సూచించారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల రైతు వేదిక భవనంలో రైతు వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనల మేరకు పంటలు సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చన్నారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగిస్తే దిగుబడులు పెరిగి ఖర్చులు తగ్గుతాయని అన్నారు.
సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక వారోత్సవాల్లో భాగంగా ఊట్కూర్ మండలంలోని అన్ని రైతు వేదిక భవనాల్లో ప్రజాప్రతినిధులు రైతులు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పచ్చి, హరిత,పశువుల ఎరువులను వినియోగించాలని సూచించారు. వానాకాలం సీజన్ ప్రారంభంలో రైతులు ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లో ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. గ్రామాల్లో విక్రయించే దళారీల వద్ద విత్తనాలు తీసుకోవద్దనిసూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఏఈవోలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
