కన్నీరు పెడుతున్న ‘పాలేరు’ రైతు…

కన్నీరు పెడుతున్న ‘పాలేరు’ రైతు…

కేంద్రాలున్నా దక్కని భరోసా!
రాత్రంతా కల్లాల వద్దే జాగారం

పాలేరు, ఆంధ్ర‌ప్ర‌భ : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం, తిరుమలాయపాలెం మండలం వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతన్నలు పండించిన పంట నీటిపాలవుతోంది. నెలల తరబడి శ్రమించి చేతికి తెచ్చిన వరి, మొక్కజొన్న దిగుబడులు ఐకేపీ (IKP) కేంద్రాల్లో కొనుగోలు చేయకపోవడంతో కల్లాల వద్దే తడిసి ముద్దవుతున్నాయి.

పేరుకే కేంద్రాలు.. అన్నీ ఆటంకాలే!

ప్రభుత్వం ఆర్భాటంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తిరుమలాయపాలెం మండలంలోని దాదాపు ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొనుగోళ్లలో జాప్యం: ధాన్యం ఆరబెట్టి సిద్ధంగా ఉంచినా, అధికారులు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వరద పాలు: ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తుండటంతో, కల్లాల్లో ఉన్న ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోతోంది. మరికొన్ని చోట్ల ధాన్యం మొలకలు వస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

కాపలాగా అన్నదాత: అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి తడిచిన ధాన్యంపై పరదాలు కప్పి, రాత్రంతా కల్లాల వద్దే జాగారం చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం. తీరా పంట చేతికొచ్చేసరికి ఐకేపీ కేంద్రాల్లో కొనే నాథుడే లేడు. వర్షం వస్తే మా కష్టమంతా నీళ్లలో పోతోంది. మమ్మల్ని ఆదుకునే వారు లేరా?” అని స్థానిక రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి రైతుల విన్నపం..

“ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, తక్షణమే స్పందించి తడిచిన ధాన్యాన్ని కూడా నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలి” అని మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అన్నదాతల కష్టాన్ని గుర్తించి, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోతే, రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.