చేనేత రంగానికి బలమైన మద్దతు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

చేనేత రంగానికి బలమైన మద్దతు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ : ఇచ్చిన మాటకు కట్టుబడుతూ కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీ నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. ఉచిత విద్యుత్ పథకం అమలులో భాగంగా తొలి నెలలో జీరో పేమెంట్ విద్యుత్ బిల్లు రావడంతో చేనేతల మోములో సంతోషం తొణికిసలాడుతోంది. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి నేతన్నలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఒకవైపు చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతూనే, నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా, గత నెల ఒకటో తేదీ నుంచి చేనేతలకు మేలు కలిగేలా ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించింది.

ఈ పథకం ద్వారా లక్షా నాలుగు వేల కుటుంబాలకు లాభం చేకూరనుంది. మగ్గంపై నేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గంపై నేసే నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించి అమలు చేశారు. ఉచిత విద్యుత్ అమలుతో చేనేత కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం లభించింది. పెన్షన్లు, త్రిఫ్ట్ ఫండ్, సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలతో చేనేత రంగానికి బలమైన మద్దతు అందుతోంది. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు రూ.4 వేల పెన్షన్, ఏటా రూ.5 కోట్ల త్రిఫ్ట్ ఫండ్, నూలుపై 15% సబ్సిడీ వంటి చర్యలు చేపడుతున్నారు.

ఉచిత విద్యుత్తో ఆర్థిక భరోసా
మగ్గం నేతన్నలకు నెలకు రూ.720, సంవత్సరానికి రూ.8,640ల వరకు లాభం చేకూరుతుంది.

జీరో విద్యుత్ బిల్లులు.. సంతోష వెల్లువ
గత నెల నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వల్ల జీరో పేమెంట్ బిల్లులు రావడంతో చేనేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన భారం లేకపోవడంతో వారు ఆనందంగా ఉన్నారు. రాష్ట్రంలో 50,252 మగ్గం నేతన్నల కుటుంబాలు, 6,995 మరమగ్గం కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. మరమగ్గం కుటుంబాలకు నెలకు రూ.1,800, ఏడాదికి రూ.21,600 వరకు లబ్ధి చేకూరనుంది.

365 రోజులూ ఉపాధి లక్ష్యం.. ప్రభుత్వ కట్టుబాటు
చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మెగా టెక్స్టైల్ పార్కులు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తూ మార్కెటింగ్ అవకాశాలు పెంచుతోంది. ఉచిత విద్యుత్ పథకం ద్వారా నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించామని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు 365 రోజులు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.

Leave a Reply