ఆపరేషన్ వజ్రప్రహార్ ముమ్మరం
ఆపరేషన్ వజ్రప్రహార్ ముమ్మరం
జిల్లా వ్యాప్తంగా మెగా కార్డన్ సెర్చ్
53 వాహనాల స్వాధీనం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: మాదకద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా పోలీసు శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ డే” నిర్వహించారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ ఐజి ఏకే రవి కృష్ణ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో అన్ని పోలీసు సబ్‌డివిజన్‌లలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
పత్తికొండ సబ్‌డివిజన్‌లో దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామం, ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ మాధవరం పీఎస్ పరిధిలో రచ్చుమర్రి, ఆదోని సబ్‌డివిజన్ ఇస్వి పీఎస్ పరిధిలో కపటి గ్రామం, కర్నూలు సబ్‌డివిజన్‌లో జోహారాపురం, ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.
డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది కలిపి మొత్తం 130 మంది పాల్గొని విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 1,500 మందిని తనిఖీ చేశారు. 165 వాహనాలను పరిశీలించారు. పత్రాలు లేని 53 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని పోలీసులు వివరించారు.
ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు. ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, కర్నూలు ఇన్‌చార్జి డిఎస్పీ ఉపేంద్ర బాబు, సీఐలు, ఎస్సైలు, ఈగల్ టీమ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
