దర్గా దర్శనానికి వెళ్లి…
దర్గా దర్శనానికి వెళ్లి…
ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గుడికల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ గుడికల్ దర్గా ఉరుసు వేడుకల వేళ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాకు చెందిన రజియా బేగం తన కుటుంబ సభ్యులతో కలిసి ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనేందుకు గుడికల్ వచ్చారు. దర్గా దర్శనానికి వెళ్లే ముందు కాలకృత్యాలు తీర్చుకొని కాళ్లు , చేతులు కడుకుందామని వారు గుడికల్ చెరువు లోకి దిగారు.

అయితే ఈ క్రమంలో కాలుజారి తల్లి రజియా బేగం, ఆమె ఏడేళ్ల కుమార్తె అఫ్రిన్ ఒక్కసారిగా లోతైన నీటిలో జారారు . ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై నీటిలోకి దూకి తల్లి రజియా బేగంను ప్రాణాలతో కాపాడగలిగారు. కానీ దురదృష్టవశాత్తు చిన్నారి అఫ్రిన్ నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.


గజ ఈతగాళ్ల బృందాన్ని రంగంలోకి దించి చెరువులో చిన్నారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కళ్లముందే చిన్నారి నీటిలో మునిగిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఉరుసు వేడుకలకు వచ్చిన భక్తుల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
