రైతు వారోత్సవాలు విజయవంతం చేయాలి

రైతు వారోత్సవాలు విజయవంతం చేయాలి

  • అవినీతిపై కఠిన చర్యలు
  • వినతుల పరిష్కారంలో ఆలస్యం సహించం
  • 99 రోజుల ప్రణాళికతో అభివృద్ధికి వేగం
  • కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించడంలో ప్రజా పాలన సభలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని బీకే ప్యాలెస్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన 99 రోజుల కార్యాచరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ప్రణాళిక దోహదపడుతోందని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారాలు అందించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

వినతులపై స్పందన
సభలో గ్రామస్తులు భూమి సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ పథకాలు, ఉపాధి అంశాలపై వినతులు సమర్పించారు. వాటిని సంబంధిత శాఖలు నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

అమలులో పథకాలు
రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి గ్యాస్, చేయూత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి, ఇందిరమ్మ చీరలు, రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

రానున్న కార్యక్రమాలు
ఇందిరమ్మ కుటుంబ బీమా, విద్యార్థులకు అల్పాహారం, రాగి జావా–పాలు పంపిణీ, ఇంటర్మీడియట్‌కు మధ్యాహ్న భోజన విస్తరణ, దివ్యాంగులకు వాహనాలు వంటి పథకాలు అమలు చేయనున్నట్లు చెప్పారు.

రైతు వారోత్సవాలకు పిలుపు
మే 4 నుంచి నిర్వహించే రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. పంట మార్పిడి, నేల సారంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అవినీతిపై కఠిన చర్యలు
ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి, ఆలస్యం చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం అందేలా చూడాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. సభలో వివిధ శాఖల అధికారులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు.