oil shortage crisis | కృత్రిమ కొరతపై ఆరోపణలు

oil shortage crisis | కృత్రిమ కొరతపై ఆరోపణలు

oil shortage crisis | యుద్ధాల ప్రభావం మరియు చమురు కొరత
గ్లోబల్ మార్కెట్‌లో యూఏఈ నిర్ణయం
భారతదేశంలో పరిస్థితుల విశ్లేషణ
ప్రపంచ రాజకీయాల వైఫల్యం

oil shortage crisis | యుద్ధం వల్ల దేశాలకు జరిగిన నష్టాలు చాలా ఉన్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన పెద్దలు తమ అనుభవాలు చెబుతుంటే, యుద్ధాలు ఎంతటి తీవ్ర ప్రభావాలు తెస్తాయో వింటున్నవారికి ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం అత్యంత తీవ్రమైన పరిణామంగా భావించబడుతున్న సమస్య ఆయిల్‌ కొరత. హైదరాబాద్‌ లాంటి పట్టణాల్లో పెట్రోల్‌ బంకుల ముందు బారులు తీరిన వాహనాలు, వాహనదారులను చూస్తే సమస్య తీవ్రత ఎంతటిదో చెప్పకనే తెలుస్తోంది.

కేంద్ర మంత్రి నితీష్‌ గడ్కరీ “రాబోయే రోజుల్లో చమురు కొరతతో డీజిల్‌, పెట్రోల్‌ వాడకం తగ్గుతుందని, ఇథనాల్‌ బ్లెండింగ్‌తో పాటు గ్రీన్‌ ఫ్యూయెల్స్‌ వినియోగం పెంచుకోవాలి” అని అన్నారని వార్తలు వచ్చాయి. ఆయన ఏ పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యలు చేశారో కానీ, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఆ విధంగా మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

ఇక మరో విభ్రాంతికర అంశం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. చమురు కొరతకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కారణమని, కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయన్న వార్తలు వెలువడటం ప్రజలను నివ్వెరపరిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొరతకు ఇదే ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కావాలనే సరఫరాను ఆలస్యం చేస్తూ, ఇరాన్‌ యుద్ధం వల్లనే ఆలస్యం జరుగుతోందని చెప్పి లాభాలు పొందాలని చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మన దేశంలో ఈ పరిస్థితి ఉండగా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఓపెక్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ చర్య గ్లోబల్‌ ఆయిల్‌ సరఫరా, ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే రష్యా సారథ్యంలో నడుస్తున్న ఒపెక్‌ ప్లస్‌ వ్యవస్థ నుంచి కూడా వైదొలుగుతుందన్న సంకేతాలు ఇచ్చింది. గ్లోబల్‌ మార్కెట్‌లో తన స్థాయిని పెంచుకోవడానికి యూఏఈ తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయంగా దీనిని చూడాలి.

ఇరాన్‌ యుద్ధం, హార్ముజ్‌ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్‌ సరఫరా తగ్గింది. భారత ప్రభుత్వం ఆయిల్‌ ధరలు పెంచడం లేదని చెబుతున్నప్పటికీ, కృత్రిమ కొరత వల్ల ప్రజల్లో అలజడి పెరిగింది. పెట్రోల్‌ బంక్‌ల వద్ద గంటల తరబడి నిలబడినా స్టాక్‌ లేదు అన్న మాట వినిపించడం సాధారణమైంది.

గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో పెద్దగా ఇబ్బందులు లేకపోవడంతో గృహాలు కష్టాల్లో పడకపోయినా, కొన్ని చోట్ల హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముందస్తు జాగ్రత్తగా స్టవ్‌లు కొనుగోలు చేయడం కూడా పెరిగింది. ఇరాన్‌-అమెరికా మధ్య చర్చల సమయంలో కొంత ఉపశమనం కనిపించినా, చర్చలు విఫలమవడంతో పరిస్థితి మళ్లీ విషమించింది.

ప్రభుత్వాలు స్టాక్‌ ఉంది, సరఫరా కొనసాగుతోంది అని చెబుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని అంటున్నారు. ప్రకటనలు ఒకలా, వాస్తవ పరిస్థితి మరోలా ఉందన్న అభిప్రాయం పెరుగుతోంది.

ఇక హీట్‌ వేవ్‌తో పాటు చమురు, గ్యాస్‌ కొరత ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. విమాన ప్రయాణ ఛార్జీలు అకస్మాత్తుగా పెరగడంతో ప్రయాణికులు ఆశాభంగానికి గురవుతున్నారు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయుల సంఖ్య పెరగడంతో కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం ఉన్నప్పటికీ, ఇరాన్‌-అమెరికా యుద్ధమే ప్రధాన కారణమని చాలామంది భావిస్తున్నారు.

ప్రపంచ స్థాయిలో ఈ సమస్యలను పరిష్కరించడానికి సమర్థ నాయకత్వం లోపం కనిపిస్తోంది. రష్యా, చైనా వంటి దేశాలు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. యూరప్‌ దేశాలు కూడా పెద్దగా స్పందించడం లేదు. పాకిస్థాన్‌ వంటి దేశం మధ్యవర్తిగా మారేందుకు ప్రయత్నించడం ప్రపంచ రాజకీయాల పరిస్థితిని తెలియజేస్తోంది. ట్రంప్‌ వంటి నేతల దూకుడు ధోరణిని కట్టడి చేసే సమతుల్య నాయకత్వం అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలమే పరిష్కారం చూపిస్తుందన్న ఆశతో ప్రపంచం ముందుకు సాగుతోంది.

రావులపాటి సీతారాంరావు

Leave a Reply