జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన

జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన
- మూడు నెలల జీతాలు కోసం నిరసన
- 180 మంది కార్మికులకు వేతనాలు నిలిపివేతపై నిరసన
- పీఎఫ్, ఈఎస్ఐ బకాయిల చెల్లింపుకు డిమాండ్
- అప్కాస్‌లో విలీనం చేయాలన్న కార్మికుల విజ్ఞప్తి
- జీతాలు ఇస్తామని సూపరింటెండెంట్ హామీ
ఆంధ్రప్రభ, విజయవాడ: విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులు మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సోమవారం ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపట్టారు. జీజీహెచ్ లోని దాదాపు 180 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమకు మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శానిటేషన్ వర్కర్స్‌తో పాటు ఇతర సిబ్బంది కూడా వేతనాల బకాయిలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తక్షణమే పెండింగ్ జీతాలను చెల్లించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న తమను అప్కాస్‌లో విలీనం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. ఈ విషయంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు స్పందిస్తూ, కార్మికులకు ఈనెల 20లోపు జీతాలు చెల్లిస్తామని ముందుగా హామీ ఇచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగినట్లు తెలిపారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు విడుదల కావడంలో ఆలస్యం కారణమని పేర్కొన్నారు. తప్పకుండ కాంట్రాక్టర్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జీతాలు ఇవ్వకపోతే కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కాంట్రాక్టర్‌కు లేదని, ఆసుపత్రి యాజమాన్యం తరఫున ఎటువంటి ఇబ్బందులు కలగవని భరోసా ఇచ్చారు.
