సింగరేణి కార్మికులకు శుభవార్త

సింగరేణి కార్మికులకు శుభవార్త
- సహజ మరణానికి రూ.10 లక్షల ఎస్‌బీఐ బీమా
గోదావరిఖని, ఆంధ్రప్రభ సింగరేణి సంస్థ తన కార్మికుల సంక్షేమం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో గురువారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొత్త ఒప్పందం ద్వారా సంస్థలోని సుమారు 40 వేల మంది కార్మికులకు, ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి.
సహజ మరణానికి బీమా..
ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న సింగరేణి ఉద్యోగులు సహజ మరణం పొందితే వారి కుటుంబాలకు రూ. 10 లక్షల గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇది నేటి నుంచే అమలులోకి వస్తుంది.ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. కోటి బీమా చెల్లించే పథకం ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది. ఇలాంటి పథకం దేశంలోనే తొలిసారిగా సింగరేణిలోనే అమలు కావడం విశేషం.
కార్మికులు కేవలం రూ. 8,906 ప్రీమియం చెల్లిస్తే, వారి కుటుంబానికి (భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు) రూ. 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.70 ఏళ్ల వయసులోపు ఉన్న విశ్రాంత కార్మికులకు కూడా రూ. 30 లక్షల ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేయనున్నారు.
పిల్లల చదువు, వివాహానికి సాయం..
కార్మికుడు మరణిస్తే వారి పిల్లల (18-25 ఏళ్లు) చదువుల కోసం అబ్బాయికి రూ. 8 లక్షలు, అమ్మాయికి రూ. 10 లక్షలు ఉచితంగా అందజేస్తారు. అలాగే వివాహ వయసు ఉన్న పిల్లలకు పెళ్లి ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున (గరిష్టంగా ఇద్దరికి రూ.10 లక్షలు) చెల్లిస్తారు.
సింగరేణి డైరెక్టర్లు (ఆపరేషన్స్, ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) ఎల్.వి సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. సింగరేణి తరఫున జనరల్ మేనేజర్ (పర్సనల్) కిరణ్ కుమార్, ఎస్‌బీఐ తరఫున డీజీఎం సి.ఎస్.పి నీలాక్షి సింగ్ ఈ పత్రాలపై సంతకాలు చేశారు.
