బీజేపీ అసత్య ప్రచారాలను నమ్మవద్దు: సతీశ్ రెడ్డి

కడెం, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌లో జరిగిన తాజా పరిణామాలపై భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

శనివారం కడెంలో ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) ఇప్పటికే 2023లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందిందని, దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందన్నారు.

ఈ నెల 17న పార్లమెంట్‌లో నిలిచిపోయిన బిల్లుకు మహిళా రిజర్వేషన్లతో సంబంధం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు పేరును అడ్డుపెట్టుకుని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ముందుకు తీసుకురావాలని ప్రయత్నించిందని ఆరోపించారు.

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్‌లో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని అన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రాంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు ఆ బిల్లును వ్యతిరేకించాయని తెలిపారు.

మహిళల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని, కానీ కేంద్ర ప్రభుత్వం పునర్విభజనను సాకుగా చూపుతూ 2029 వరకు అమలు ఆలస్యం చేస్తోందని విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటూ బీజేపీ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.

మహిళా సాధికారత కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం నుండి పార్లమెంట్‌లో మహిళల వాటా కోసం పోరాడటం వరకు కాంగ్రెస్ పాత్ర ఉందన్నారు. బీజేపీ నాయకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న విషప్రచారాన్ని ప్రజలు గమనించాలని, దక్షిణాది రాష్ట్రాల హక్కులను దెబ్బతీసే ఏ బిల్లునైనా కాంగ్రెస్ గట్టిగా అడ్డుకుంటుందని సతీశ్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply