ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన నగరంగా..

ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన నగరంగా..
కట్టమంచి, గంగినేని చెరువులో “స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాలు
చిత్తూరు, ఆంధ్రప్రభ : ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన నగరంగా చిత్తూరును తీర్చిదిద్దగలమని కమిషనర్ పి నరసింహ ప్రసాద్ చెప్పారు. శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల అంశమైన “జలధార జల హారతి” సాగునీటి సంరక్షణ కార్యక్రమాన్ని కట్టమంచి, గంగినేని చెరువు వద్ద నిర్వహించారు. చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు, ఎంహెచ్వో డా. లోకేష్, ఇతర ముఖ్య నాయకులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సందర్భంగా నగరపాలక సిబ్బంది, అధికారులు, పార్టీ నాయకులు కట్టమంచి చెరువు కట్టపై శుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. కట్టకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ళకంపలను తొలగించారు. వాకింగ్ ట్రాక్ ను శుభ్రపరిచారు. అనంతరం గంగినేని చెరువులో వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, నాయకుల భాగస్వామ్యంతో నగరంలో “స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈనెల అంశమైన సాగునీటి వనరుల సంరక్షణలో భాగంగా చెరువులను శుభ్రపరుస్తున్నట్లు చెప్పారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ఎక్కడా చెత్త నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, డంపింగ్ యార్డ్ లోని వ్యర్ధాలను సైతం తొలగిస్తున్నట్లు చెప్పారు. చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత మాట్లాడుతూ.. ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న “స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.

నగరంలో పారిశుద్ధ్యం మెరుగ్గా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నాగేంద్ర, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, నగర పార్టీ అధ్యక్షుడు నరేష్ చౌదరి, పచ్చయప్ప, నలిని, వరలక్ష్మి, అరుణ, అశోక్, క్లస్టర్, డివిజన్ ఇన్చార్జులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

