వెంకటేశ్వర ఆలయంలో ఉచిత నేత్ర పరీక్ష శిబిరం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : డివిజన్ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శరత్ లేజర్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఉచిత నేత్ర పరీక్ష శిబిరం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకుడు డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డి తెలిపారు.
శనివారం శిబిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్నట్లుగా మానవుడికి కన్ను అత్యంత ముఖ్యమైన ఇంద్రియమని పేర్కొన్నారు. కంటి చూపు సరిగా ఉంటే స్వయం సమృద్ధిగా జీవనం సాగించవచ్చని అన్నారు. ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా కంటి సమస్యలు పెరుగుతున్నాయని, కంటి ఆరోగ్యానికి విటమిన్-ఏ ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచించారు.
ఈ శిబిరంలో సుమారు 100 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అందులో ఐదుగురికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించి, వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నాళ్ల కృష్ణమూర్తి, ఇమ్మడి రాంబాబు, ఆప్టమాలజిస్టులు వై. నందిని, జీవన్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
