‘నేస్తం బడికి రా’ పోస్టర్ విడుదల

‘నేస్తం బడికి రా’ పోస్టర్ విడుదల

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పాఠశాల వెలుపల ఉన్న ప్రతి చిన్నారిని తిరిగి విద్యాబాట పట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “నేస్తం బడికి రా” కార్యక్రమానికి కర్నూలులో శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ ఏ. సిరి కలెక్టర్ బంగ్లాలో కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలిక పాఠశాలలో చేరేలా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డ్రాపౌట్‌లను పూర్తిగా తగ్గించి, విద్యార్థుల హాజరును మెరుగుపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయనున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, వాలంటీర్లు కలిసి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. బడి మానేసిన మరియు ఎప్పుడూ బడిలో చేరని పిల్లలను గుర్తించి వారి వివరాలను నమోదు చేస్తారు. అనంతరం అవగాహన ర్యాలీలు, గ్రామ సమావేశాల ద్వారా తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించనున్నారు. పిల్లలను తిరిగి బడికి తీసుకురావడానికి “బడిబాట” కార్యక్రమాన్ని చేపట్టి, అవసరమైతే బ్రిడ్జ్ కోర్సుల ద్వారా వారికి ప్రత్యేక శిక్షణ అందించి వయస్సుకు తగ్గ తరగతుల్లో చేర్పించనున్నారు.

ఉపాధ్యాయులు సర్వేలో చురుకుగా పాల్గొని, పిల్లల వివరాలను ఐఎంఎంఎస్ యాప్‌లో నమోదు చేయాలని, తల్లిదండ్రులతో సమన్వయం సాధించి విద్యార్థులను బడికి పంపేలా ప్రోత్సహించాలని సూచించారు. డ్రాపౌట్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
“బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి – అదే మన బాధ్యత” అనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply