కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి..

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి..
బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : మండలంలోని అంతంపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామ సొసైటీ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పంట మార్పిడి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా సొసైటీ పరిధిలోని అంతంపల్లి, లక్ష్మీదేవినిపల్లి గ్రామాల్లో ఉన్న రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట సాగు చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం మార్క్ పేడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. క్వింటాలుకు 600 రూపాయల చొప్పున రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను గుర్తించి వెంటనే అంతంపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ఉన్నారు.
