అగ్నిగోళం.. బయటకు వెళితే ఇక అంతే..

అగ్నిగోళం.. బయటకు వెళితే ఇక అంతే..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పగటి వేళల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాత్రిపూట కూడా చల్లదనం లేకపోవడంతో ఉక్కపోత మరింత పెరిగింది. గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల వేడి ప్రభావం ఇంకా తీవ్రమవుతోంది. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా మండే ఎండ, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్‌ను దాటగా, దాదాపు 20 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పగటి వేడి ఎక్కువగా ఉండగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాత్రిపూట ఉక్కపోత తీవ్రంగా ఉండటం గమనార్హం. నగర ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వెస్ట్ మారేడుపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 24 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సాధారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గి ఉపశమనం కలగాల్సిన సమయంలో కూడా వేడి తగ్గకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు ఉత్తర తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం రాత్రి ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గి 20 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లాలో అత్యల్పంగా 17 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 18.4 డిగ్రీలుగా నమోదైంది.
వచ్చే రెండు వారాల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. పగలు మాత్రమే కాకుండా రాత్రిళ్లు కూడా వేడి తగ్గకపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పగటి పూట అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్లడం, తగినంత నీరు తీసుకోవడం, వృద్ధులు మరియు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
