రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు బిక్కనూర్ విద్యార్థి…

బిక్కనూరు, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ ఫలితాలను ఇంటర్ బోర్డు ఆదివారం విడుదల చేసింది ఇందులో బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన ఒక విద్యార్థి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు. మండల కేంద్రానికి చెందిన వడ్లూరి మహేష్ పదవ తరగతి వరకు పట్టణంలో గల బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.
ఆయన ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలోనే ఆయన తండ్రి మృతి చెందారు. కుటుంబ పోషణ కోసం చదువు మానేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఆయనను ప్రోత్సహించి పదవ తరగతి వరకు చదివించారు. పదవ తరగతిలో మండల టాపరుగా నిలిచారు.
దీంతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ గ్రూపులో చేరారు. కష్టపడి చదువుకొని 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆయనను బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు రాజ గంగారెడ్డి తోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.
