కాన్వాయ్ ఆపి వ్యాపారుల సమస్యలు విన్న ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : చిరు వ్యాపారుల సమస్యలను తెలుసుకునేందుకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి తన కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడిన ఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తున్న చిరు వ్యాపారులను గమనించిన ఆయన, మంత్రిగారి పర్యటనకు వెళ్తూ మధ్యలోనే కాన్వాయ్ ఆపి వ్యాపారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగారు. ఈ సందర్భంగా వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే స్వయంగా వచ్చి తమ సమస్యలు తెలుసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పొదిల రామయ్య, కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా అంబేద్కర్ చౌరస్తాలో వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, సరైన షెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గతంలో కొన్ని షెడ్లు నిర్మించినప్పటికీ, ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు అధికారులను కోరామని పేర్కొన్నారు.

డ్రైనేజీ నిర్మాణం ఎత్తుగా ఉండటంతో వ్యాపారం చేసేందుకు ఇబ్బందిగా మారిందని, దీనిని సరిచేసి షెడ్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో తమ సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీధి వ్యాపారులు సాదిక్, ఖాజా, రవీంద్రాచారి, బంగారయ్య, భాస్కర్, నరసింహ, ఆరిఫ్, సుధాకర్, లక్ష్మయ్య, శశికళ, సుజాత, పద్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply