చిత్తూరులో వినతులు స్వీకరించిన చైర్మన్ జహార్

చిత్తూరులో వినతులు స్వీకరించిన చైర్మన్ జహార్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : షెడ్యూల్డ్ కులాల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం రాష్ట్ర ఎస్సీ కమిషన్ సమర్థంగా పనిచేస్తోందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జహార్ తెలిపారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక ఆర్ & బి అతిథి గృహంలో షెడ్యూల్డ్ కులాల ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన, అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. చిత్తూరు జిల్లాను ఎస్సీ కమిషన్ తరఫున సందర్శించే అవకాశం రావడం సంతోషకరమని పేర్కొన్న జహార్, జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నామని తెలిపారు.
ముఖ్యంగా భూ సమస్యలు, భూతగాదాలు అధికంగా ఉన్నాయని గుర్తించామని, వాటిని సమగ్రంగా పరిశీలిస్తూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. కాస్ట్ సర్టిఫికెట్‌లకు సంబంధించిన సమస్యలపై స్పందిస్తూ, గతంలో ఆది ఆంధ్ర, ఆది ఆంధ్ర క్రిస్టియన్ వంటి వర్గీకరణల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర సమీక్ష చేపట్టి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని 53 విభాగాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ సమానంగా అందుతున్నాయా అనే అంశంపై కూడా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

కమిషన్ చైర్మన్‌గా 15 శాతం రిజర్వేషన్ పరిధిలో వచ్చే దళితుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో సుమారు 25 శాతం దళిత జనాభా ఉన్న నేపథ్యంలో, వారి అభివృద్ధిలో భాగస్వామ్యం పెంచేందుకు చర్చలు జరిపినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశమై పలు కీలక సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాను ఒక మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, కుల వివక్ష రహిత జిల్లా, అట్రాసిటీ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై మాట్లాడుతూ, జిల్లాకు కేటాయించిన నిధులు నిర్దిష్ట శాతంలో వినియోగించకపోతే సంబంధిత ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. దళిత క్రైస్తవుల సమస్యలపై మాట్లాడుతూ, 1950 అధ్యక్ష ఉత్తర్వు ప్రకారం వచ్చిన అంశాలే ప్రస్తుతం మళ్లీ చర్చకు వస్తున్నాయని పేర్కొన్నారు.

కార్పొరేషన్ లోన్లు లేదా ఇతర ప్రయోజనాలు కులం పేరుతో ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవస్థలో మార్పులు వచ్చినప్పటికీ, వివక్షకు సంబంధించిన పునాదులు ఇంకా కొనసాగుతున్నాయని, స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు గడిచినా ఈ సమస్యలు పూర్తిగా నివారణ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

