ఏప్రిల్ 9 నుంచే హేలీ టూరిజం సేవలు ప్రారంభం:

ఏప్రిల్ 9 నుంచే హేలీ టూరిజం సేవలు ప్రారంభం:
మంత్రి జూపల్లి కృష్ణారావు..
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : కృష్ణమ్మ పరవళ్లు.. నల్లమల ప్రకృతి అందాలను ఆకాశ మార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు చేరువవనుంది. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ సోమశిల – శ్రీశైలం క్షేత్రాల మధ్య ‘హేలీ టూరిజం’ సేవలను ఈ నెల 9వ తేదీన ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. శనివారం కొల్లాపూర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాప్టర్ యాత్ర సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుందని మంత్రి వివరించారు.
సోమశిల చేరుకున్న పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చని, అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చని తెలిపారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన చెప్పారు.
మరిన్ని ప్రాంతాలకు విస్తరణ..
రానున్న రోజుల్లో ఈ సేవలను కేవలం సోమశిలకే పరిమితం చేయకుండా నాగార్జున సాగర్, రామప్ప, నిజాం సాగర్ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలకు కూడా విస్తరిస్తామని మంత్రి జూపల్లి వెల్లడించారు. తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
