Ap Cm With People : పేదమ్మకు భరోసా Andhra Prabha News

Ap Cm With People : పేదమ్మకు భరోసా Andhra Prabha News
- ఇంజమూరులో పేదింట్లో సీఎం పరామర్శ
- అమరావతిపై కీలక వ్యాఖ్యలు
- రాజధాని భవిష్యత్తుపై స్పష్టత
- విశ్వనగరంగా అమరావతి అభివృద్ధి
- సంక్షేమ పథకాలపై సీఎం దృష్టి
- దీపం 2.0, గ్యాస్ పైప్‌లైన్ ప్రణాళిక
- నీటి ప్రాజెక్టులు, చెరువు పునరుద్ధరణ చర్యలు
- నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి
- నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం
- రైతులతో సీఎం మాటామంతీ
( నెల్లూరు, ఆంధ్రప్రభ బ్యూరో)

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరులో పేదల సేవలో పాల్గొన్నారు. వింజమూరు ఎస్సీ కాలనీలో యరగొర్ల బాలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పింఛను అందించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తన చిన్న కుమారుడు బాలరాజు కాలేయ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని బాలమ్మ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. బాలరాజుకు ప్రభుత్వం తరఫున వైద్యం అందిస్తామని బాలమ్మ కుటుంబానికి సీఎం భరోసా ఇచ్చారు.
Ap Cm With People : అంగుళం కూడా కదపలేరు

ఇక అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎవరూ అంగుళం కూడా రాజధానిని కదల్చలేరని ఆయన అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి… ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని.. లోక్‌సభలో చట్టబద్దత బిల్లుకు ఆమోదం పొందటం ఆంధ్రులకు దక్కిన గౌరవమని సీఎం అన్నారు. బిల్లు ఆమోదంతో అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని తెలిపారు.
Ap Cm With People : విశ్వనగరిగా తీర్చి దిద్దుతాం

రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి.. ఈ బిల్లుకు మద్దతు పలికిన పార్టీలకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. గత పాలకులు మూడు ముక్కలాటతో విధ్వంసం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆక్షేపించారు. రాజధానికి చట్టబద్దత కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం పెడితే కనీసం శాసనసభ సమావేశాలకు కూడా ఆ పార్టీ హాజరు కాలేదన్నారు. రాజధాని ప్రాంతాన్ని స్మశానమని, ఏడారి అని, ముంపు ప్రాంతమని ఎగతాళి చేసి ఆనందించారని సీఎం ఆరోపించారు.
Ap Cm With People : సంక్షేమానికి పెద్దపీట

ప్రతీ నెలా మొదటి తేదీన పేదల సేవలో ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా పేదల సేవలో ఉంటున్నామని తెలిపారు. ప్రతీ నెలా రూ.2,750 కోట్లను పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్న ప్రభుత్వం ఏపీనే అని సీఎం వివరించారు. పొరుగున తమిళనాడులో కేవలం రూ. వెయ్యి మాత్రమే పెన్షన్ గా ఇస్తున్నారని అన్నారు. ప్రజలపై ఉన్న అభిమానం తోనే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని చేయగలుగుతున్నామని సీఎం వివరించారు. గత ఏడాది జూన్ లో తల్లికి వందనం కింద ఆర్ధిక సహకారం అందించామని.. ఈ ఏడాది జూన్ లోనూ తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు.
Ap Cm With People : త్వరలో పైప్ లైన్ లో గ్యాస్
దీపం 2.0 కింద ఏడాదికి 3 ఉచిత సిలెండర్లను ఇస్తున్నామని త్వరలోనే ప్రతీ ఇంటికీ పైప్ ద్వారా గ్యాస్ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. దీని కోసం ఏడాదికి రూ.2400 సబ్సీడిని కూడా వినియోగదారుల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్వాన్సుగా రూ.1300 కోట్లను ఇచ్చిందని గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. 25 వేల కుటుంబాల్ని దత్తత తీసుకునేందుకు అదానీ ట్రస్టు కూడా ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి వివరించారు.
Ap Cm With People : జువ్వలదిన్నెపై దుష్ప్రచారం
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పాతచెరువుకు సోమశిల కాలువ నుంచి నీటిని తరలించేందుకు రూ.34 కోట్లతో పనులు చేపడతామని దీనిపై తక్షణం ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి చెరువును నింపుతామని భరోసా ఇచ్చారు. నీటి భద్రత కోసం స్థానిక వింజమూరు ప్రజలు వేసిన ఒక్క అడుగుకు ప్రజా ప్రభుత్వం వంద అడుగులు ముందుకు వేసి తోడుగా నిలబడుతుందన్నారు. రూ.70 లక్షల వ్యయంతో చెరువును పునరుద్దరణకు తీసుకున్న చొరవను ముఖ్యమంత్రి అభినందించారు. నీటి సంరక్షణ కోసం ప్రజలు ఇదే స్పూర్తితో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
Ap Cm With People : ఇక పారిశ్రామిక అభివృద్ధే
నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని .. రామాయపట్నం పోర్టు, దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్ తో పాటు రక్షణ పరికరాలు, మానవ రహిత విమానాలు తయారవుతాయని .. ఇఫ్కో సెజ్ లో ఏర్పాటు కానున్న సౌర ఫలకాల తయారీ సహా వేర్వేరు పరిశ్రమల ద్వారా 80 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని 2018 లోనే కేంద్రానికి లేఖ రాసి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. రూ.285 కోట్లతో దీని నిర్మాణం చేపట్టామని.. దీనిని వక్రీకరించి కొందరు హిట్ అండ్ రన్ నేరాల రాజకీయం చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు.
Ap Cm With People : గతం అంతా అరాచకమే
2019-24 మధ్య జరిగిన అరాచక, విధ్వంస పాలన కొనసాగిందని అలాంటి వ్యక్తిని తన జీవితంలో చూడలేదని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ మత్స్యకారులకు అన్యాయం చేసే పరిస్థితి ఉండదన్నారు. తమిళనాడు నుంచి వచ్చే మత్స్యకారులు ఎవరూ మన జలాల్లో చేపల వేట చేయకుండా నిఘా పెట్టాలని నెల్లూరు, తిరుపతి కలెక్టర్లను సీఎం వేదిక నుంచి ఆదేశించారు.
Ap Cm With People : నేతన్నలకు ఉచిత విద్యుత్

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇవాల్టి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 93 వేల చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకూ, 11,488 పవర్ లూమ్ లకు 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని తెలిపారు. దీని కోసం మొత్తం 153 కోట్లను వ్యయం చేస్తున్నామని.. ఉచిత విద్యుత్ పథకం వల్ల ఒక్కో చేనేత కుటుంబానికి వేల రూపాయల మేర ఆదా అవుతుందన్నారు. నేతన్న సంక్షేమానికి.. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. చేనేతల సంక్షేమం కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేశామని.. 55 ఏళ్లకే పెన్షన్ కూడా అందిస్తున్నట్టు తెలిపారు. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ పథకం కింద 5 చోట్ల హ్యాండ్లూమ్ క్లస్టర్లను ప్రారంభించబోతున్నట్టు సీఎం ప్రకటించారు. అనంతరం లబ్దిదారులకు ఉచిత విద్యుత్ సరఫరా ధృవపత్రాలను అందించారు. 21 నెలల్లో 5.5 లక్షల గృహప్రవేశాలు చేయించామని.. డిసెంబరు లోగా 4.5 లక్షల ఇళ్లలో ప్రవేశించేలా నిర్మాణాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రజావేదిక సమీపంలో సూక్ష్మసేద్యం సహా డ్రోన్ సహకారంతో సేద్యానికి సంబంధించిన స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి ఫరూఖ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదమస్తాన్ రావు, ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేశ్, జిల్లా కలెక్టర్ హిమాన్షూ శుక్లా హాజరయ్యారు.
ALSO READ : No 3 Capitals : ఏపీకి అమరావతి కిరీటం Andhara Prabha SPL News
