గురుకుల పాఠశాలలో విషాదం

గురుకుల పాఠశాలలో విషాదం
రెండో అంతస్తు నుంచి జారిపడి విద్యార్థిని మృతి
పాతపట్నం,ఆంధ్రప్రభ : స్థానిక బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పెను విషాదం చోటుచేసుకుంది. పాఠశాల భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి చింతాడ పూజిత (12) అనే 7వ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజన విరామం కావడంతో విద్యార్థులంతా మెట్ల గుండా కిందకు వస్తున్నారు.
ఈ క్రమంలో మూడో అంతస్తు నుంచి వస్తున్న పూజిత అదుపుతప్పి మెట్ల పైనుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక మెడకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన పూజితను పాఠశాల సిబ్బంది వెంటనే పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తల లోపలి భాగంలో తీవ్ర రక్తస్రావం జరగడం వల్లే మరణం సంభవించిందని వైద్యులు వెల్లడించారు. మృతురాలు పూజిత తండ్రి సింహాద్రి వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఎంతో కష్టపడి తన కుమార్తెను గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు.
అల్లారుముద్దుగా పెరుగుతున్న కుమార్తె విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లి కొత్తమ్మ, తండ్రి సింహాద్రి ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి ఆర్తనాదాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. పాఠశాల యాజమాన్యం, ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారాన్ని సేకరించి, కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
