సింహవాహనంపై శ్రీ గంగా, పార్వతీ(దుర్గా)సమేత మల్లేశ్వరులు…

సింహవాహనంపై శ్రీ గంగా, పార్వతీ(దుర్గా)సమేత మల్లేశ్వరులు…
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలోశ్రీగంగా, పార్వతీ(దుర్గా)సమేత మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్బంగా నాలుగవ రోజు బుధవారం పండితులు మూల మంత్రహవనములు నిర్వహించారు.అనంతరం సదస్యము కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా వేద స్వస్తి, వేద పండితులు వేద ఆశీస్సులు అందజేశారు. సాయంత్రం ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తి పూర్వకంగా జరిగాయి. చైత్ర మాస కల్యాణ బ్రహ్మోత్సవ వాహన సేవల్లో భాగంగా మల్లేశ్వర మహామండపం నుండి శ్రీ గంగా, పార్వతీ(దుర్గా) సమేత మల్లేశ్వరుల సింహవాహనసేవ ప్రారంభం అయింది.
ఆది దంపతులు అధిరోహించిన సింహవాహన దర్శనంతో మానవులలో అచైతన్యంగా ఉన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయని, సోమరితనం నశించి పట్టుదలతో ముందుకు సాగి సర్వత్రా విజయం సాధించి ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుందని పురాణోక్తి. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ వాహనోత్సవం ద్వారా అమ్మవారు రూపిస్తున్నారు.

ఇలా ప్రఖ్యాతిగాంచిన సింహ వాహనంపై అమ్మవార్లు, స్వామి కొలువై ఉండగా.. సంప్రదాయ కళలైన తప్పెట్లు, మహిళా కోలాట నృత్యములు, చిన్నారుల కోలాట ప్రదర్శన,తాళం భజన కళాకారుల ప్రదర్శలు ముందు సాగుతుండగా, వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ సింహ వాహనసేవ శ్రేణి శ్రీ కనకదుర్గానగర్, రధం సెంటర్, మార్కెట్, గాంధీ నగర్, గవర్నర్ పేట,పాత బస్ స్థాండ్, ఫ్లైఓవర్ మీదుగా తిరిగి దేవస్థానం చేరుకుంటుంది.సింహవాహనసేవ సందర్బంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు విశేషసంఖ్యలో ఊరేగింపు లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వికె శీనా నాయక్,స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాస శాస్త్రి తదితరులు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు.
