సాగునీటి కోసం రైతుల నిరసన..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : రంగయ్య చెరువు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. 365 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు “నీళ్లు ఇవ్వాలి… పంటలు కాపాడాలి…” అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
కాలువల పనులు ఆలస్యం కావడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలువల పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి మరింత పెద్ద స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ నిరసనతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
