100% వసూళ్లే లక్ష్యం

100% వసూళ్లే లక్ష్యం

  • టార్గెట్‌కు ఒక అడుగు దూరం…
  • ప్రజల సహకారం కీలకం
  • పన్ను బకాయిలు తీర్చండి…
  • అచ్చంపేటను ఆదర్శంగా మార్చండి
  • మున్సిపల్ మేనేజర్ రమేష్ నాయక్

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లకు గడువు ముగియడానికి కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉండటంతో పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు వెంటనే తమ బకాయిలను చెల్లించాలని మున్సిపల్ మేనేజర్ వి. రమేష్ నాయక్ కోరారు. ఆర్థిక సంవత్సరం టార్గెట్ సాధనలో ప్రజల సహకారం అత్యంత కీలకమని ఆయన తెలిపారు.

ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31లోగా 100 శాతం పన్నులు వసూలు చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు లభిస్తాయని, అవి పట్టణ అభివృద్ధికి బలంగా ఉపయోగపడతాయని వివరించారు. ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ నిధులు కీలకమని పేర్కొన్నారు.

అయితే గడువులోగా లక్ష్యం చేరుకోలేకపోతే కేంద్ర నిధులు కోల్పోయే ప్రమాదం ఉందని, దాంతో పట్టణ అభివృద్ధి పనులు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది మండుటెండను సైతం లెక్కచేయకుండా సెలవు దినాల్లో కూడా ప్రజలను కలుసుకుంటూ పన్నులు చెల్లించాల్సిన అవసరాన్ని వివరించి అవగాహన కల్పిస్తున్నారు.

కొంతమంది బకాయిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పన్నులు చెల్లిస్తుండగా, ఇంకా మిగిలిన వారు వెంటనే స్పందించాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే అధిక శాతం వసూళ్లు పూర్తయ్యాయని, కానీ ఇంకా కొందరు బకాయిదారులు మిగిలి ఉన్నందున చివరి రోజును సద్వినియోగం చేసుకుని వెంటనే చెల్లింపులు చేయాలని సూచించారు.

ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే 100 శాతం టార్గెట్ సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పన్నులు చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, అదే పట్టణ అభివృద్ధికి బాటవేస్తుందని పేర్కొంటూ అచ్చంపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ మేనేజర్ రమేష్ నాయక్ పిలుపునిచ్చారు.

Leave a Reply