భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ..

భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ..
- ఇంద్రకీలాద్రిపై ఆదివారం ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు దేవస్థానంలో ఆదివారం ఉదయం సూర్యోపాసన సేవ భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. లోకకళ్యాణం, భక్తుల ఆయురారోగ్యాలు కోసం నిర్వహించిన ఈ సేవలో ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వేద పండితులు అరుణ పారాయణం, మహాసౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళి పఠనాలతో ఆదిత్యుడికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ ప్రాంగణం వేదఘోషలతో మార్మోగింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యోపాసన వల్ల ఆరోగ్యం, తేజస్సు, మానసిక ప్రశాంతత లభిస్తాయని పండితులు వివరించారు.
ముఖ్యంగా ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు కావడంతో ఈ సేవకు విశేష ప్రాధాన్యత ఉందని తెలిపారు. సూర్యోపాసన అనంతరం శ్రీ కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక హారతులు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చక బృందం, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
