మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్కడ..?
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్కడ..?
మొక్కజొన్న మద్దతు ధర కల్పించరా?…
రవి సీజన్లో రైతుల కష్టాలు తీర్చండి..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు 2,400 రూపాయల ప్రకారం ప్రభుత్వమే రైతుల వద్ద ఉన్న మొత్తం మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం ప్రతినిధి ల బృందం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ను కోరింది. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ను ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి రామ చంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి సురేష్, జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి ల ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో లక్షలాది ఎకరాల్లో మొక్కజొన్న వేసిన రైతాంగం అధిక వర్షాలకు తగ్గిన దిగుబడి వల్ల సకాలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, మధ్య దళారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం మూలంగా తీవ్రంగా నష్టపోయారన్నారు. కనీసం రబీ సీజన్లోనైనా పండించుకుని అప్పుల బాధ నుండి విముక్తి చెందుదామని ఆశతో లక్షన్నర ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేశరన్నారు.
ఎకరాకు 40 వెల రూపాయలు వరకు పెట్టుబడి పెట్టగా, దిగుబడి మాత్రం ఎకరాకు 30 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందన్న రు. మొక్కజొన్న కొనుగోలు మధ్య దళారులు సిండికేట్ గా ఏర్పడరని పేర్కొన్నరు.క్వింటా కేవలం 1600 రూపాయల నుండి 1700 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఫలితంగా జిల్లాల్లో మొక్కజొన్న పంట వేసిన ప్రతి రైతు ఎకరాకు 20 నుండి 25 వేల రూపాయల వరకు నష్టపోతున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మద్దతు ధరల చట్టాలు చేయడం తప్ప ఆచరణలో ఆ చట్టాలను అమలు చేయడం లో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. ఫలితంగా క్వింటా 2400 రూపాయలకు అమ్ముకోవాల్సిన రైతులు ప్రైవేట్ వ్యాపారస్తుల దయదక్షిణ్యాలపైఆధారపడి పంటలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా రైతాంగం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయి, వడ్డీ వ్యాపారస్తుల ఒత్తిడీలు తట్టుకోలేక అవమానులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.
ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ప్రభుత్వాలు రైతాంగం వాడే విత్తనాలు, ఎరువులు ,పురుగుల మందులు ధరలు విపరీతంగా పెంచడం తప్ప, తాము ప్రకటించిన మద్దతు ధరల చట్టాలను సకాలంలో అమలు చేయాలనే ఆలోచన, శ్రద్ధ పెట్టడం లేదన్నారు. కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా రైతుల వద్ద ఉన్న మొత్తం మొక్కజొన్నలను ప్రభుత్వమే క్వింటాలు 2400 రూపాయలు ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా… జిల్లా కలెక్టర్..
రైతు సంఘం సభ్యులు చెప్పిన విషయాలకు స్పందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా రైతు సంఘం నాయకులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉందని, అయినప్పటికీ సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారన్న హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
